Ministers On Medaram: మేడారం మహా జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష..
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:15 PM
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
హైదరాబాద్: సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు సీతక్క, అడ్లురు లక్ష్మణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో మేడారం జాతర నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనల మేరకు.. మేడారం దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్‌ను మంత్రులు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు...
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. సమ్మక్క సారలమ్మ పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునికరణ పనులు చేపట్టాలని తెలిపారు. భక్తుల సందర్శనార్థం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తుచేశారు. అలాగే.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని భావించారు.
గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు. సమ్మక్క సారలమ్మ సేవ కోసం జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమించాలని పేర్కొన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహా మేడారం జాతరకు రూ.150 కోట్లు ప్రజా ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు కేటాయిస్తామని మంత్రులు వివరించారు.
జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూయించి అప్రూవల్ తీసుకుంటామని మంత్రులు చెప్పారు. ముఖ్యమంత్రి సలహాలు సూచనల మేరకు మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారం అభివృద్ధి ప్రతి దశలో పూజారులను భాగస్వామ్యం చేస్తామని చెప్పుకొచ్చారు. సమ్మక్క సారలమ్మల త్యాగాన్ని, ఔన్నత్యాన్ని మరింత చాటి చెప్పే విధంగా మేడారం ఆలయ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తామని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు