Google Maps Team Attacked: గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితక్కొట్టిన గ్రామస్థులు.. సర్వే కోసం వెళితే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:08 PM
ఓ గ్రామంలో సర్వే కోసం వెళ్లిన గూగుల్ మ్యాప్స్ బృందంపై స్థానికులు దాడి చేశారు. వారి ప్రత్యేక వాహనాన్ని చూసి గ్రామస్థులు అపోహలకు లోనయ్యారు. చోరీ కోసం సమాచారం సేకరించేందుకు వారు వచ్చారని పొరబడి దాడికి దిగారు. అసలు విషయం తెలిశాక శాంతించారు. యూపీలో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ గ్రామానికి వచ్చిన గూగుల్ మ్యాప్స్ బృందంపై స్థానికులు దాడికి తెగబడిన ఘటన యూపీలో తాజాగా వెలుగు చూసింది. కాన్‌పూర్‌లోని బిర్హార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది (Google Maps Team Attacked in UP).
బిర్హార్ గ్రామంలోని రోడ్‌ల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేసేందుకు టెక్ మహీంద్రాకు చెందిన ఓ ఔట్‌సోర్సీంగ్ బృందం సభ్యులు ప్రత్యేక వాహనంలో వెళ్లారు. మ్యాప్ అప్‌డేషన్ కోసం తమ వాహనంపై కెమెరా, ఇతర పరికరాలను అమర్చారు. సర్వే సమయంలో వాహనాన్ని చూసిన గ్రామస్థులు అపోహలకు గురయ్యారు. గ్రామంలో చోరీ చేసేందుకు ప్రత్యేక పరికరాలతో సమాచారాన్ని సేకరిస్తున్నారని అనుకున్నారు. వెంటనే స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టి అడ్డగించారు. ఈ క్రమంలో వివాదం ముదరడంతో వారు గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితక్కొట్టేశారు. పరిస్థితి మరింతగా దిగజారక ముందే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
ఆపై ఇరు వర్గాలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. గూగుల్ మ్యాప్స్ బృందం తాము ఆ గ్రామానికి ఎందుకు వెళ్లిందీ కూలంకషంగా పోలీసులకు వివరించారు. తాము ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఇది విన్నాక గ్రామస్థులు శాంతించారు.
అనవసర అపార్థాలకు లోనై గ్రామస్థులు తమపై దాడి చేశారని గూగుల్ మ్యాప్స్ బృందం సభ్యుడు ఒకరు తెలిపారు. ‘మ్యాపింగ్ కోసం నేను, మా టీం సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లాను. ఇందుకోసం డీజీపీ అనుమతి కూడా మేము తీసుకున్నాము’ అని ఆయన వాపోయారు. అయితే, వారు ఈ దాడి గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.
ఇటీవల కాలంలో తమ గ్రామంలో చోరీ ఘటనలు పెరిగిపోయాయని స్థానికులు తెలిపారు. ఫలితంగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఇక అక్కడ పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని కాన్‌పూర్ పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే తాము అక్కడకు చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పి శాంతింపజేశామని అన్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఏమీ లేదని చెప్పారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, గ్రామాల్లో సర్వేలు చేసే సమయాల్లో గూగుల్ బృందాలు పలు సవాళ్లు ఎదుర్కుంటున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు గ్రామాల్లో రోడ్ల సమాచారం, ఇతర వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
జపాన్ టూరిస్టుల నుంచి లంచం వసూలు.. ట్రాఫిక్ పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..