Gurugram Cop Suspended: జపాన్ టూరిస్టుల నుంచి లంచం వసూలు.. ట్రాఫిక్ పోలీసులపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:11 AM
జపాన్ టూరిస్టుల నుంచి లంచం తీసుకున్న ఇద్దరు గురుగ్రామ్ పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: చట్టానికి రక్షణగా ఉండాల్సిన ఇద్దరు పోలీసులు కట్టుతప్పి భారీ మూల్యం చెల్లించుకున్నారు. వారు లంచం తీసుకున్న వ్యవహారంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెన్షన్ వేటు వేశారు. గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జపాన్‌కు చెందిన ఓ మహిళ, మరో వ్యక్తి స్కూటీపై వెళుతుండగా అక్కడి ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డగించారు. స్కూటీ వెనక సీటుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా చెల్లించాలని అన్నారు. అయితే, జరిమానాను నగదు రూపంలో చెల్లించాలని కోరారు. ఇక్కడ చెల్లిస్తారా? లేక కోర్టులో చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. వీసా కార్డుతో చెల్లించొచ్చా అని జపాన్ టూరిస్టులు ప్రశ్నించారు. నగదు రూపంలో చెల్లించాలని, కార్డు వద్దని పోలీసులు అన్నారు. దీంతో, సదరు టూరిస్టు రెండు రూ.500 నోట్లను ఓ పోలీసుకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆ పోలీసు.. టూరిస్టులకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం కలకలానికి దారి తీసింది.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ద్విచక్రవాహనం వెనక సీటుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.1000 జరిమానాగా చెల్లించాలి. ఈ జరిమానాను పరివాహన్ యాప్ లేదా పోర్టల్ ద్వారా డిజిటల్‌గా చెల్లించాలి. అది సాధ్యం కాని పక్షంలో పోలీసులు పీఓఎస్ మెషీన్ లేదా యూపీఐ ద్వారా జరిమానా కట్టించుకోవాలి. ఆ తరువాత ప్రింటెడ్ రసీదును వాహనదారుడికి ఇవ్వాలి. కానీ ఈ ఉదంతంలో పోలీసులు ఇలాంటివేమీ చేయకపోవడంతో వివాదం మొదలైంది. డబ్బు తీసుకున్నాక రసీదు జారీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. దేశం పరువు తీసేశారంటూ జనాలు తలంటేశారు. పోలీసుల తీరుపై జపాన్ టూరిస్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. తనతోపాటు అక్కడ అనేక మంది వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసులు వారిని అడ్డగించలేదని ఆరోపించారు. కావాలనే తనను టార్గెట్ చేశారేమో అని పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేయాలని కూడా పోలీసు శాఖ పేర్కొంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా భరోసా ఇచ్చింది.
ఇవీ చదవండి:
ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..
వామ్మో.. భలే సీన్.. వందేళ్ల నాటి చర్చ్‌ను ఒక చోట నుంచి మరో చోటకు తరలింపు