Kiruna Church Relocation: వామ్మో.. భలే సీన్.. వందేళ్ల నాటి చర్చ్‌ను ఒక చోట నుంచి మరో చోటకు తరలింపు
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:34 PM
అరుదైన ఖనిజాలున్న గనుల విస్తరింపులో భాగంగా స్వీడెన్‌లోని దాదాపు వందేళ్ల నాటి ఓ చెక్క చర్చ్‌ను ఐదు కిలోమీటర్ల దూరంలోని మరో చోటకు చక్రాలు అమర్చిన ట్రెయిలర్‌పై పెట్టి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర స్వీడెన్ ప్రాంతమైన కిరునాలో వందేళ్ల నాటి చర్చ్‌ను భారీ ట్రాలీలపై పెట్టి ఒక చోట నుంచి మరో చోటకు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 672 టన్నుల బరువున్న ఈ చర్చ్ ఏ మాత్రం దెబ్బతినకుండా మరో చోటకు జరిపిన తీరు, ఈ ఫీట్ వెనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యాలు జనాలను అబ్బురపరుస్తున్నాయి.
కిరునా ప్రాంతంలో ఇనుప గనులు ఉన్నాయి. ఐరోపాలోనే అతి భారీ గనుల్లో ఒకటిగా వీటికి పేరుంది. దీనికి తోడు ఆ ప్రాంతంలో అరుదైన ఖనిజాలు కూడా ఉన్నట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో, అక్కడి మైనింగ్ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ సిద్ధమైంది. కిరునా టౌన్‌లోని వారందరికీ మరో చోట పునరావాసం ఏర్పాటు చేసింది. గనుల విస్తరణ కారణంగా ఆ ప్రాంతంలోని నేలలోపలి పొరలు అస్థిరంగా మారాయి. అక్కడి జనాలకు ఇది ప్రమాదకరంగా మారడంతో ఏకంగా టౌన్ మొత్తాన్ని మార్చేందుకు వారు సిద్ధమయ్యారు.
అయితే, వారసత్వ కట్టడాలను కూల్చే ఉద్దేశం లేక వాటిని యథాతథంగా మారో ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేసిందా కంపెనీ. దాదాపు రెండు రోజుల పాటు ఈ తరలింపు జరిగింది. పదుల సంఖ్యలో చక్రాలు ఉన్న బల్లలాంటి నిర్మాణంపై చర్చ్‌ను క్రేన్ సాయంతో జాగ్రత్తగా పెట్టి, ఐదు కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టౌన్‌కు తరలించారు. మొత్తం రెండో రోజుల పాటు ఈ ప్రయాణం సాగింది. భారీ రథంలా కనిపిస్తున్న ఈ చర్చ్‌ను చూసేందుకు అక్కడికి జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఈ వింతను వీక్షించేందుకు స్వయంగా స్వీడెన్ రాజు కూడా వచ్చారు. ఈ తరలింపులో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని కలిసి కరచాలనం కూడా చేశారు. ఇక చర్చ్ పక్కన ఉన్న బెల్ టవర్‌ను కూడా త్వరలో తరలించనున్నారు.
చర్చ్‌తో పాటు ఆ ప్రాంతంలోని 23 చారిత్రక వారసత్వ కట్టాడాలను ఇదే విధంగా తరలించామని ఆ సంస్థ పేర్కొంది. కొత్త ప్రాంతంలో నివాస సముదాయాల వైపు చర్చ్ ద్వారం ఉండేలా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. చర్చ్ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వైనంపై కొందరు ప్రశ్నించగా మరికొందరు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గనుల విస్తరణతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
పుతిన్ అంటే ఇదీ.. ఈ అమెరికా వ్యక్తికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూస్తే
విమానం కాక్‌పిట్‌లో పైలట్‌ల రొమాన్స్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎయిర్‌హోస్టెస్