Cement Price Drop: కొత్త జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గనున్న సిమెంట్ ధరలు..
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:04 PM
దేశంలో ఇటీవల తీసుకున్న రెండు శ్లాబ్‌ల నిర్ణయంతో అనేక ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ రంగానికి కీలకమైన సిమెంట్ ధరలు కూడా భారీగా తగ్గిపోనున్నాయి. గతంతో పోల్చితే ఈసారి ధరలు మరింత తక్కువ స్థాయికి చేరే అవకాశం ఉంది.
దేశంలో నిర్మాణ రంగానికి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. నిర్మాణ పనుల్లో ఎక్కువగా ఉపయోగించే సిమెంట్ కొనుగోలు ఖర్చు ఇకపై తగ్గనుంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దీనికి కారణం. ఇప్పటివరకు సిమెంట్‌పై 28 శాతం జీఎస్టీ చెల్లించగా, ఇక మీదట 18 శాతం మాత్రమే చెల్లిస్తే చాలు.
ఈ నిర్ణయం వల్ల నిర్మాణ ఖర్చులు తగ్గి, ఇళ్లు కట్టుకునే వారితో పాటు రియల్ ఎస్టేట్ వంటి పరిశ్రమలకు ఆర్థిక లాభం చేకూరనుంది. సిమెంట్ ధరలు తగ్గడం వల్ల నిర్మాణ పనులు మరింత సులభతరం కానున్నాయి. ఈ మార్పు సామాన్య ప్రజలకు, నిర్మాణ సంస్థలకు ఊరటనిస్తుంది.
తక్కువ ధరల వల్ల సిమెంట్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా హౌసింగ్ ప్రాజెక్టులకు ఖర్చు తగ్గనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో సిమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కో ప్రాజెక్టులో 30–35 శాతం ఖర్చు నిర్మాణ సామగ్రిపై ఆధారపడి ఉంటుంది, అందులో సిమెంట్ చాలా ముఖ్యం. ధరలు తగ్గడం వల్ల హౌసింగ్ డెవలపర్లకు లాభం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారత సిమెంట్ పరిశ్రమ ప్రస్తుతం సంవత్సరానికి 700 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోంది. అనేక కంపెనీలు ఈ రంగంలో వాటా కలిగి ఉన్నాయి. తక్కువ ధరల కారణంగా సిమెంట్ వినియోగం పెరిగి, ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. ఇది సాధారణ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. సిమెంట్ ధరల తగ్గుదల వల్ల ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి, దీంతో సామాన్యులు తక్కువ ఖర్చుతో ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.
అంతేకాకుండా, సిమెంట్ ధరల తగ్గుదల వల్ల నిర్మాణ రంగంలో పోటీ పెరిగి, మరింత నాణ్యమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి కూడా దోహదపడుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి