Minister Anam: 22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:13 PM
మరికొద్ది రోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన దసరా ఉత్సవాలపై విజయవాడలో సమావేశం జరిగింది.
విజయవాడ, సెప్టెంబర్ 04: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ వారు దర్శనమివ్వనున్నారని చెప్పారు. దసరా నవరాత్రులు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇంద్రకీలాద్రి దిగువనున్న జమ్మిదొడ్డిలోని దుర్గు గుడి ఈవో కార్యాలయంలో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మ వారి దర్శనం సాఫీగా అయ్యేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వారి సలహాలు, సూచనలతో భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్, దుర్గ గుడి ఈవో శీను నాయక్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దసరా నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు విజయవాడకు తరలి రానున్నారు. అలా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ జిల్లాలో 9 బార్లకు రీ నోటిఫికేషన్
అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..
For More AP News And Telugu News