CM Revanth Reddy: అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి..
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:19 PM
కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నష్టం ఎక్కువగా జరగకుండా అప్రమత్తమై, సరైన సమయంలో స్పందించి చర్యలు చేపట్టిన అధికారులను ఆయన అభినందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో వ్యవహరించాలని ఆయన చెప్పుకొచ్చారు.
భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలి..
ఈ సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంచార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సమీక్షలో సీతక్క దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఫండ్‌ను రాబట్టుకోవాలని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించడానికి అధికారులు కృషి చేయాలని సీఎం వివరించారు.
యూరియాపై రియాక్షన్..
రైతులు ఎక్కువ సేపు లైన్లో నిలబడి అలిసిపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలిసిపోవడం వల్ల అసలు యూరియా లేదని చెప్తున్నారని పేర్కొన్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉందని చెప్పుకొచ్చారు. అందరూ ఒకే దగ్గర ఉండేసరికి యూరియా కోసం ఉన్న లైన్ పెద్దగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. లైన్లో చివర ఉన్న వారికి యూరియా ఇవ్వాలంటే 8 గంటల సమయం పడుతుందని వివరించారు. ఆ 8 గంటలు లైన్లో నిలబడలేక, సహనం కోల్పోయి.. ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి కావాలనే రోడ్ల మీద కూర్చో పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి:
గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితక్కొట్టిన గ్రామస్థులు.. సర్వే కోసం వెళితే..
ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..