Hyderabad News: వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం..
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:30 PM
వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్లు మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భద్రత, రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు.
గణేష్ నిమజ్జనానికి సర్వంసిద్ధం..
నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 200 మంది గజ ఈతగాళ్లను చెరువులు, కొలనుల వద్ద ఉంచినట్లు వెల్లడించారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని తీసుకున్నామని అన్నారు. నిమజ్జన యాత్ర మార్గాల్లో 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 6న 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం 6వ తేదీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం మధ్యాహ్నం 1:30 గంటలోపు పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు.
రోడ్డు సేఫ్టీ డ్రైవ్..
నగరంలో వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలకు నగరంలోని పలుప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డే అండ్ నైట్ రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ 11,442 గుంతలను పూడ్చి వేసినట్లు స్పష్టం చేశారు. రేపు(శుక్రవారం) అర్ధరాత్రి వరకు నగర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిబ్బందికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితక్కొట్టిన గ్రామస్థులు.. సర్వే కోసం వెళితే..
ఈ20 పెట్రోల్.. ఏయే దేశాల్లో ఈ తరహా పెట్రోల్‌ను వాడుతున్నారంటే..