Share News

Paracetamol Pregnancy Risk: ప్రెగ్నెన్సీ టైంలో పారాసిటమాల్ వాడితే పుట్టబోయే బిడ్డకు ఆటిజం..!

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:01 AM

గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నొప్పి, జ్వరం నుండి ఉపశమనం పొందడానికి పారాసిటమాల్ తీసుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మంది గర్భిణీ స్త్రీల మనస్సులో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసుకుందాం?

Paracetamol Pregnancy Risk: ప్రెగ్నెన్సీ టైంలో పారాసిటమాల్ వాడితే పుట్టబోయే బిడ్డకు ఆటిజం..!
Paracetamol during Pregnancy Risks

గర్భధారణ సమయంలో మహిళలు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా శిశువుకు ప్రాణాంతకం కావచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో భారీ స్థాయిలో హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో నొప్పి సర్వసాధారణం. అందుకని అలాంటి పరిస్థితిలో పారాసిటమాల్ వాడాలని అనుకుంటే కచ్చితంగా ఓసారి డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇటీవల వైద్యులను సంప్రదించకుండానే పారాసిటమాల్ విచ్చలవిడిగా వాడేస్తున్నారు ప్రజలు. కానీ, గర్భధారణ సమయంలో పారాసిటమాల్ ఇలా వాడితే పుట్టబోయే శిశువుకు ఆటిజం లేదా ఇతర సమస్యలు వచ్చే అవకాశముందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.


ఎసిటమినోఫెన్ అని పిలువబడే పారాసిటమాల్ మాత్రలను గర్భధారణ సమయంలో నొప్పి నివారిణకు వాడితే పుట్టబోయే పిల్లలలో ఆటిజం అండ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) ప్రమాదాన్ని పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. పారాసిటమాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నొప్పి నివారిణ ఔషధం. ఇటీవలి సంవత్సరాలలో దీని వాడకం తీవ్ర కావడంతో మౌంట్ సినాయ్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మునుపటి 46 అధ్యయనాల నుండి లక్ష మంది కంటే ఎక్కువ మందిని విశ్లేషించారు. మొదటి, రెండవ లేదా మూడవ నెలలో లేదా మొత్తం గర్భధారణ సమయంలో పారాసిటమాల్ ఎప్పుడు తీసుకున్నారనే దానిపై ఈ ఈ బృందం వివరణాత్మక డేటాను సేకరించింది. దానిని తల్లుల వైద్య రికార్డులతో అనుసంధానించింది. నావిగేషన్ గైడ్ సిస్టమాటిక్ రివ్యూ మెథడాలజీని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఆరోగ్య డేటాను మూల్యాంకనం చేశారు.


కాబోయే తల్లులు పారాసిటమాల్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని తాజా అధ్యయనం తేల్చింది. ఎందుకంటే, ఇది సాధారణంగా ఓవర్-ది-కౌంటర్ ఔషధం. నాడీ అభివృద్ధి రుగ్మతలకు కారణమవుతుంది. ప్రినేటల్ ఎసిటమినోఫెన్ ఎక్స్‌పోజర్ ఆటిజం, ADHD ప్రమాదాల పెరుగుదల మధ్య గల సంబంధాన్ని ఈ పరిశోధనలు స్పష్టంగా వెల్లడించాయి. BMC ఎన్విరాన్‌మెంటల్ హెల్త్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన పత్రం ప్రచురితమైంది.


గర్భధారణ సమయంలో పారాసెటమాల్ అసలు తీసుకోవద్దా?

గర్భధారణ సమయంలో ఏదైనా నొప్పి నివారణ మందు అవసరమైతే పారాసిటమాల్ తీసుకోవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు ఏదైనా ఔషధం తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో మందులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. నొప్పి, జ్వరం తీవ్రతను బట్టి ప్రతి నాలుగు నుండి ఆరు గంటలకు 500 mg నుండి 1000 mg మోతాదు అవసరం. అయితే, గర్భధారణ సమయంలో పారాసిటమాల్ మోతాదు వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే శిశువులో జన్యుపరమైన లోపాలు, టెస్టోస్టిరాన్ స్థాయుులు తగ్గడం, ఆటిజం, శ్వాససంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తు్న్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

ఇవి కూడా చదవండి

9 టు 5 జాబా?.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీచేతుల్లో..

27 వారాల శిశువుకు అపోలోలో అరుదైన వైద్యం

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం

Updated Date - Aug 24 , 2025 | 09:08 AM