హోలోగ్రామ్ రూపంలో... దివి నుంచి భువికి ప్రత్యక్షంగా..
ABN , Publish Date - Aug 24 , 2025 | 07:43 AM
టెక్నాలజీ అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సంగీత ప్రపంచంలో ఇటీవల ‘హోలోగ్రామ్’ కాన్సర్ట్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ ప్రక్రియలో ఎప్పుడో భౌతికంగా దూరమైన అభిమాన గాయనీ గాయకులు డిజిటల్‌గా స్టేజీ మీద కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.
టెక్నాలజీ అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సంగీత ప్రపంచంలో ఇటీవల ‘హోలోగ్రామ్’ కాన్సర్ట్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ ప్రక్రియలో ఎప్పుడో భౌతికంగా దూరమైన అభిమాన గాయనీ గాయకులు డిజిటల్‌గా స్టేజీ మీద కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. మైఖేల్ జాక్సన్ నుంచి మన ర్యాపర్ సిద్దూ మూసేవాలా దాకా... ‘హోలోగ్రామ్స్’ రూపంలో దుమ్మురేపుతున్నారు.
ఇండియన్ సింగర్, ర్యాపర్ ‘సిద్దూ మూసే వాలా’ త్వరలోనే అభిమానులను తన పాటతో అలరించబోతున్నారు. మూడేళ్ల క్రితం చనిపోయిన సిద్దూ మూసేవాలా తిరిగి ఎలా వస్తాడని అంటారా? హోలోగ్రామ్ టెక్నాలజీతో ఇది సాధ్యం కానుంది. త్వరలోనే సిద్దూ మూసే వాలా ‘హోలోగ్రామ్ వరల్ట్ టూర్’ ఉంటుందనే ప్రకటన వెలువడగానే... తమ ప్రియమైన గాయకుడిని తిరిగి వేదికపై చూడొచ్చనే ఆనందం అభిమానుల్లో వ్యక్తమయింది. ఇలాంటి టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గాయకుల హోలోగ్రామ్ కాన్సర్ట్‌లు జరిగాయి.

అత్యంత ప్రభావవంతమైన సంగీత కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందిన అమెరికన్ ర్యాపర్, నటుడు ట్యుపాక్ షకుర్ మరణించిన పదహారేళ్ల తరువాత 2012లో కోచెల్లాలో చేసిన హోలోగ్రామ్ ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తమ అభిమాన గాయకుడు మళ్లీ కళ్ల ముందుకు వచ్చినట్టుగా ప్రేక్షకులు అనుభూతి చెందారు. హోలోగ్రామ్ అనేది భవిష్యత్తులో లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త వినోదాన్ని అందించనుంది. ‘‘ఒక కళాకారుడి స్వరాన్ని లైవ్ ఎక్స్‌పీరియన్స్‌లోకి తీసుకురావడానికి ఇది చక్కని మార్గం. ఒక పాప్ కల్చర్‌లో లెజెండ్స్ రెండుసార్లు జన్మించడం అని చెప్పొచ్చు’’ అంటారు మార్కెటింగ్, ట్రెండ్ స్పెషలిస్టు దివ్య దీక్షిత్.
గతం మళ్లీ ముందుకు...
ప్రపంచవ్యాప్తంగా తమ పాటలతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ర్యాపర్స్ ఎందరో ఉన్నారు. అలాంటివారు భౌతికంగా దూరమైనప్పుడు... డిజిటల్ రూపంలో తిరిగి వేదికపైకి తీసుకురావడం సాంకేతికతతో సాధ్యమవుతోంది. వాటిని హోలోగ్రామ్ ప్రదర్శనలని పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరిగింది. కోచెల్లాలో నిర్వహించిన ‘ట్యుపాక్ షకుర్ హోలోగ్రామ్ ప్రదర్శన’ సంగీత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ తరువాతే హోలోగ్రామ్ కాన్సర్ట్‌ల ట్రెండ్ మొదలైంది. మైఖేల్ జాక్సన్, విట్నీ హ్యూస్టన్, మారియా కల్లాస్ వంటి దిగ్గజాల హోలోగ్రామ్ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. పాతతరం గాయకుల పాటలను, మ్యుజీషియన్ల సంగీతాన్ని కొత్తతరం ఆస్వాదించేందుకు ఈ ప్రదర్శనలు చక్కగా ఉపయోగపడుతున్నాయి.

వర్చ్యువల్ బ్యాండ్స్
డిజిటల్ రూపంలో ప్రదర్శనలు ఇచ్చే ట్రెండ్ మొదలయ్యింది. ఈ తరహా కాన్సర్ట్‌లు నిర్వహించే వారిని ‘వర్చ్యువల్ బ్యాండ్స్’ అని పిలుస్తారు. ఆ కోవకు చెందినదే బ్రిటిష్ వర్చ్యువల్ బ్యాండ్ గొరిల్లాజ్. మ్యుజీషియన్ డామన్ అల్బర్న్, ఆర్టిస్టు జామీ హెవ్లెట్‌లు ఈ బ్యాండ్ రూపకర్తలు. ఈ బ్యాండ్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్లు బ్యాండ్ మెంబర్లుగా కనిపిస్తాయి. ఈ బ్యాండ్ నుంచి 2001లో వచ్చిన మొదటి ఆల్బమ్ ట్రిపుల్ ప్లాటినమ్‌ను సొంతం చేసుకుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ వర్చ్యువల్ బ్యాండ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంది.
కొన్ని కోల్పోతాం...
టెక్నాలజీని ఉపయోగించి స్టేజ్‌పై కళాకారుడిని పునఃసృష్టి చేసినా, లైవ్ షోలో ఉండే కొన్ని మెళకువలు మిస్ అవుతాయి.
ఏఐ, హోలోగ్రాఫిక్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా అభిమానులు వాటిని ఎంత వరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకమే. ‘‘టెక్నాలజీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సిద్దు, కె.కె, జగ్జీత్‌సింగ్ వంటి వారిని సజీవంగా ఉంచడానికి ఇదొక మార్గం. అయితే హోలోగ్రామ్ ప్రదర్శనను అభిమానులు ఎంతవరకు అంగీకరిస్తారనేది చూడాలి. ప్రారంభంలో గొప్పగా అనిపించినా కొద్ది కాలానికి అభిమానులు ఆసక్తిని కోల్పోతారు’’ అంటారు సింగర్ షిబానీ కశ్యప్. మెటావర్స్‌లో లైవ్ ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సింగర్‌గా షిబానీ కశ్యప్ గుర్తింపు పొందారు. లైవ్ కాన్సర్ట్‌లో సింగర్‌కి, ప్రేక్షకులకు మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. ఆకస్మికంగా చోటు చేసుకునే సంఘటనలు ఉంటాయి. అలాంటి అంశాలు హోలోగ్రామ్ ప్రదర్శనలో కనిపించవు. అంతేకాకుండా సింగర్‌పై అభిమానం, ప్రేమ, గౌరవంతో ప్రేక్షకులు కాన్సర్ట్‌కు హాజరు కావచ్చు.
భవిష్యత్తులో...
వినోద వ్యాపారంలో హోలోగ్రాఫిక్ కాన్సర్ట్‌లు విప్లవాత్మక మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది. మరణించిన తరువాత కూడా కళాకారుల కెరీర్ కొనసాగే వీలుంటుంది. దీనివల్ల ఒకే సమయంలో ఎన్ని దేశాలలోనైనా కాన్సర్ట్ కొనసాగించవచ్చు. దీనివల్ల మ్యూజిక్ ప్రదర్శనలు పెరుగుతాయి. చిన్న చిన్న పట్టణాల్లోని వారు సైతం సంగీత ప్రదర్శనలను వీక్షించే అవకాశం దక్కుతుంది.
ఎలా ఉంటుంది?
స్టేజ్‌పై 45 డిగ్రీల కోణంలో ఉన్న ట్రాన్స్‌పరెంట్ మైలార్ షీట్‌పై ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేస్తారు. అధికశక్తి కలిగిన ఎప్సన్ ప్రొజెక్టర్స్ 25వేల ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ కలిగిన ప్రత్యేక స్ర్కీన్‌పై ఇమేజ్‌ను కనిపించేలా చేస్తాయి. ఒక 60 వాట్ బల్బు 800 ల్యూమెన్స్‌తో సమానం. ఈ స్ర్కీన్‌పై పడిన డిజిటల్ ఇమేజ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. హోలోగ్రామ్ కాన్సర్ట్ కోసం స్టేజ్‌పై కొన్ని ప్రత్యేకమైన ఎలిమెంట్స్ అవసరమవుతాయి. ప్రత్యేకమైన హోలోగ్రాఫిక్ ఫాయిల్ స్ర్కీన్, పవర్‌ఫుల్ ప్రొజెక్టర్స్, ఎల్‌ఈడీ స్ర్కీన్ ఉంటాయి. డిజిటల్ ఇమేజ్ స్టేజ్‌పై ఉన్నా మ్యూజిక్ మాత్రం లైవ్‌గా అందిస్తారు. ఇందుకోసం స్టేజ్‌పై ఉన్న మ్యుజీషియన్స్ డిజిటల్ పర్‌ఫార్మర్‌తో స్మూత్‌గా సింక్రనైజ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు నిజమైన కాన్సర్ట్ అనుభూతి సొంతమవుతుంది.
పరిమితులు ఉన్నా...
హోలోగ్రామ్ కాన్సర్ట్‌లో కొన్ని పరిమితులుంటాయి. డిజిటల్ ఇమేజ్ మెట్లు ఎక్కడం, నిర్దేశించిన మార్గం కాకుండా మరో చోటకు కదలడం సాధ్యం కాదు. అంతేకాకుండా కొన్ని యాంగిల్స్‌లో నుంచి చూస్తే డిజిటల్ ఇమేజ్ ఇల్యూజన్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్‌లో ప్రేక్షకులు కూర్చోకుండా చూసుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్మార్ట్ స్టేజ్ డిజైన్ చేసుకోవాలి. డిజిటల్ ఆర్టిస్టులు, లైవ్ మ్యుజీషియన్స్ మధ్య ఇంటరాక్షన్‌లో తేడా రాకుండా చూసుకోవాలి. హోలోగ్రామ్ ప్రదర్శనల వల్ల నిర్వాహకులకు ఖర్చు చాలా తగ్గుతుంది. మ్యూజిక్ బ్యాండ్ సభ్యుల వసతి ఖర్చు మిగులుతుంది. పరికరాలను తరలించే అవసరం ఉండదు. నిర్వాహకులు కార్యక్రమాన్ని స్టూడియో నుంచి బ్రాడ్‌కాస్ట్ చేసే వీలుంటుంది. దీనివల్ల సభ్యుల రవాణ షెడ్యూల్‌కు ఇబ్బందులుండవు. ఏ దేశంలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించాలన్నా సులువవుతుంది.
విట్నీ హ్యూస్టన్
1992లో వచ్చిన ‘ది బాడీగార్డ్’ సౌండ్‌ట్రాక్‌లో ‘ఐ విల్ ఆల్వేస్ లవ్ యు’ పాట యువతరాన్ని ఉర్రూతలూగించింది. హ్యూస్టన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఇది. బిల్‌బోర్డ్ హాట్ 100లో 14 వారాల పాటు ఈ పాట చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు హ్యూస్టన్ భౌతికంగా మన మధ్య లేరు. అయితే 2020 నుంచి 2023 మధ్య హోలోగ్రామ్ కాన్సర్ట్‌ల ద్వారా మళ్లీ స్టేజ్‌పై ఆమె డిజిటల్ రూపాన్ని చూసి అభిమానులు పులకించిపోయారు.
ట్యుపాక్
అమెరికన్ ర్యాపర్, సింగర్ అయినటువంటి ట్యుపాక్ 2012లో కోచెల్లాలో హోలోగ్రామ్ కాన్సర్ట్‌లో తళుక్కున మెరిశారు. అప్పటిదాకా అభిమానులకు ఈ టెక్నాలజీ గురించి అవగాహన లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. చనిపోయిన సింగర్‌ని ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నాలజీతో స్టేజ్‌పైన డిజిటల్ రూపంలో కనిపించేలా చేయడం అదే మొదటిసారి.
మైఖేల్ జాక్సన్
2014లో జరిగిన బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో మైఖేల్ జాక్సన్ హోలోగ్రామ్ కాన్సర్ట్‌ను ప్రదర్శించారు. ‘స్లేవ్ ద రిథమ్’ పేరుతో ఐదుగురు సభ్యుల బృందం, పదహారు మంది డ్యాన్సర్లతో హోలోగ్రామ్ ప్రదర్శన సాగింది. హోలో మూన్‌వాక్ ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంది.
మరియా కల్లాస్
1970వ దశకంలో అభిమానులను తన పాటతో అలరించారు మరియా కల్లాస్. 1977లో ఆమె చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా హోలోగ్రామ్ కాన్సర్ట్‌లతో మళ్లీ అభిమానులకు చేరువయ్యారు. బేస్ హోలోగ్రామ్ అనే సంస్థ కల్లాస్ కాన్సర్ట్‌లను ప్రదర్శించింది.
రాయ్ అర్బిసన్
‘ఓ ప్రెట్టీ ఉమెన్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్’ అంటూ సన్‌గ్లాసెస్ ధరించి పాతగిటారుతో పాడిన పాట సంగీతప్రియులను మైమరిచిపోయేలా చేసింది. ఆ పాట పాడింది రాయ్ అర్బిసన్. ఆయన లేకపోయినా హోలోగ్రామ్ ప్రదర్శనతో ఇటీవల అందరినీ అలరించారు. బేస్ హోలోగ్రామ్ సంస్థే ఈ కాన్సర్ట్‌ను కూడా నిర్వహించింది.