Tribal Complaints: ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని డబ్బు కాజేసింది
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:00 AM
నెల్లూరు జిల్లాకు చెందిన కి‘లేడి’ నిడిగుంట అరుణ చేతిలో మోసపోయిన, చిత్రహింసలకు గురైనవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
కి‘లేడి’ అరుణపై గిరిజనుల ఫిర్యాదు
కోవూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు
శ్రీకాంత్ సోదరుడు మునికృష్ణ బైండోవర్
ఇప్పటికే నమోదైన కేసుల్లో లోతుగా దర్యాప్తు
అరుణ కాల్ రికార్డుల పరిశీలన ఆమె కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్
నెల్లూరు (క్రైం), ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాకు చెందిన కి‘లేడి’ నిడిగుంట అరుణ చేతిలో మోసపోయిన, చిత్రహింసలకు గురైనవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద రూ. లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అరుణ నగదు తీసుకొని మోసం చేసిందంటూ శుక్రవారం రాత్రి పలువురు స్థానిక గిరిజనులు కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరుణపై మరో కేసు నమోదు చేశారు. ఫిర్యాదులపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు రౌడీషీటర్ అవిలేలి శ్రీకాంత్ సోదరుడు మునికృష్ణను తిరుపతి జిల్లా గూడూరు-2 పోలీసుస్టేషన్‌లో బైండోవర్ చేశారు. నెల్లూరు కేంద్రకారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌ను శుక్రవారం రాత్రి విశాఖపట్నం జైలుకు తరలించారు. శ్రీకాంత్‌కు పెరోల్ రద్దయినప్పటి నుంచి ఆయన నేరాలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జైలులో శ్రీకాంత్ ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మరో జైలుకు తరలించాలని జైలు సూపరింటెండెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి ఆదేశాల మేరకు శ్రీకాంత్‌ను ఏఆర్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు మధ్య విశాఖ జైలుకు తీసుకెళ్లారు.
రౌడీషీటర్ల అరెస్ట్‌లు !
రౌడీషీటర్ శ్రీకాంత్, ఆయన ప్రియురాలు అరుణలకు అండగా ఉంటూ నేరాలకు పాల్పడిన పలువురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు రౌడీషీటర్లను ఆయా స్టేషన్‌ల పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన అరుణ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అప్పటికే ఫోన్‌లోని రెండు సిమ్‌లను ఆమె తొలగించింది. ఫోన్ అన్‌లాక్ పాస్‌వర్డ్ చెప్పాలని పోలీసులు కోరగా ఆమె నిరాకరించిందని, అది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణలన్నీ రికార్డు చేయడం అరుణకు అలవాటని తెలుసుకున్న పోలీసులు.. ఆడియో, వీడియో కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. వాటిలో పలువురు రౌడీషీటర్లకు తరచూ ఆమె కాల్స్ చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. వీటి ఆధారంగా పోలీసులు శనివారం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అరుణతో గతంలో ఫోన్‌లో మాట్లాడిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. కాగా, ఒంగోలు జైలులో ఉన్న అరుణను పూర్తిస్థాయిలో విచారించేందుకు కస్టడీ కోసం కోవూరు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం.
విశాఖ సెంట్రల్ జైలుకు అవిలేలి శ్రీకాంత్
ఇటీవల వివాదాస్పద నేపథ్యంలో పెరోల్‌పై బయటికొచ్చి వార్తల్లోకెక్కిన జీవిత ఖైదీ అవిలేలి శ్రీకాంత్ (40)ను నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి శనివారం ఉదయం విశాఖ కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు. అతడిని ప్రత్యేక సెల్‌లో ఉంచినట్టు విశాఖ కేంద్ర కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్ సాయిప్రవీణ్ తెలిపారు. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయా(అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్)ల్లో భాగంగా శ్రీకాంత్‌ను జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి తరలించినట్టు సాయిప్రవీణ్ వెల్లడించారు. కాగా, గూడూరులో వైన్‌షాపు యజమాని హత్యాకేసులో శ్రీకాంత్‌కు 2007లో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014లో జైలు నుంచి తప్పించుకోగా, అతడిని తిరిగి 2018లో పట్టుకొని జైలుకు తీసుకొచ్చారు. దీంతో శ్రీకాంత్‌కు శిక్ష కూడా పెరిగింది. ఇటీవల పెరోల్ రావడం, రద్దవడం విషయమై శ్రీకాంత్ వార్తల్లోకెక్కాడు.
శ్రీకాంత్ పెరోల్ కోసం మొదట
సిఫారసు చేసింది వైసీపీ ఎమ్మెల్యేలే!
చెవిరెడ్డ్డి, కిలివేటి లేఖలు ఇస్తే తప్పులేదా?
ఇంకెప్పుడూ సిఫారసు లేఖలు ఇవ్వను: కోటంరెడ్డి
నెల్లూరురూరల్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ శ్రీకాంత్‌ను పెరోల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు మొదట సిఫారసు లేఖలు ఇచ్చింది వైసీపీ ఎమ్మెల్యేలేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. శనివారం నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాంత్‌ను పెరోల్‌పై విడుదల చేసేందుకు తనతోపాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ సిఫారసు లేఖలు ఇవ్వడంపై వైసీపీ యాగీ చేస్తోందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య.. శ్రీకాంత్‌కు ఎలా సిఫారసు లేఖలు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 16న తనతోపాటు గూడూరు ఎమ్మెల్యే ఇచ్చిన లేఖలను ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. అయినా 14 రోజుల తర్వాత శ్రీకాంత్ పెరోల్‌పై బయటకు వచ్చాడన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారన్నారు. తానిచ్చిన సిఫారసు లేఖపై రాజకీయ దుమారం రేగినందున ఇక భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ కోసం సిఫారసు లేఖలను ఇవ్వబోనని ప్రకటించారు.
