Solar Power Project: అదానీ సంస్థకు 2,400 ఎకరాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:54 AM
అదానీ సంస్థ సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి భూకేటాయింపులు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు 2016లోనే 2,400 ఎకరాల ప్రభుత్వ భూములను...
2016లో భూముల ముందస్తు పొజిషన్
2019లోనే పూర్తయిన సోలార్ ప్రాజెక్టు
ఇప్పుడు 33 ఏళ్ల లీజుకు భూ కేటాయింపుపై రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
2019 నాటి మార్కెట్ విలువలో 10 శాతంగా ఫీజు
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అదానీ సంస్థ సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి భూకేటాయింపులు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు 2016లోనే 2,400 ఎకరాల ప్రభుత్వ భూములను ముందస్తు పొజిషన్ కింద ఇవ్వగా.. 2019లోనే ఈ ప్రాజెక్టు పూర్తయి, అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు దాదాపు పదేళ్లకు నింపాదిగా ఆ ప్రాజెక్టుకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఆ భూమిని కేటాయిస్తున్నట్లుగా సర్కారు ఉత్తర్వులిచ్చింది. 2019 నాటి మార్కెట్ విలువ ఆధారంగా 10 శాతం లీజు ఫీజు ఉంటుందని పేర్కొంది. ప్రతీ ఐదేళ్లకోసారి లీజు ఫీజు 10 శాతం పెరుగుతుందని తెలిపింది. మధ్యలో పదేళ్లు భూమి కేటాయింపు విషయంలో కదలిక లేకుండా.. ఇప్పుడే ఎందుకు కేటాయింపు ఉత్తర్వు ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై రెవెన్యూ శాఖ స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలను రేకెత్తించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. 2016లో ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి రెవెన్యూ శాఖకు ఒక దరఖాస్తు వచ్చింది. అదానీ సోలార్ ఎనర్జీ సంస్థ కడప జిల్లా మైలవరం మండలం ధోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకుంటోందని, భూములు కేటాయించాలని కోరింది. ఆనాడు ప్రభుత్వం ఇందుకు అంగీకరించి.. భూమి ధర, కేటాయింపు వివ రాలను నిర్ధారించకుండానే భూములను ముందస్తు పొజిషన్‌కు ఇచ్చింది. ధోడియంలో 2,305.74 ఎకరాలు, వడ్డిరాలలో 94.36 ఎకరాల భూమిపై అదానీకి ముందస్తు పొజిషన్ ఇచ్చారు. 2019 నాటికి సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును పూర్తి చేశారు.
కానీ ఆ తర్వాత ఈ కంపెనీకి భూ కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. దీనిపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దృష్టిసారించలేదు. అయితే, ఇటీవల ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ఉంది. ఆగమేఘాల మీద కడప కలెక్టర్ నుంచి భూకేటాయింపు ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణా సంస్థ (ఏపీఎల్‌ఎమ్‌ఏ)లో భూకేటాయింపు విధానంపై చర్చించారు. దీని ప్రకారం భూమిని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించారు. అదీ 2019 నుంచి లీజు కాలం అన్నట్లుగా, లీజు ఫీజును భూమి మార్కెట్ విలువలో 10 శాతంగా నిర్ధారించారు. ధోడియంలో ఎకరాకు 3 లక్షలు, వడ్డిరాలలో ఎకరం 6.25 లక్షలుగా ఖరారు చేశారు.