Dengue Prevention Tips: డెంగ్యూ విజృంభిస్తోంది.. ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:43 PM
వర్షాకాలం వచ్చిందంటే చాలు. డెంగ్యూ దోమలు విజృంభిస్తాయి. ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వైరల్ ఫీవర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి, డెంగ్యూ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించాల్సిందేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రతి సంవత్సరం, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య డెంగ్యూ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఈ విషజ్వరాల ధాటికి మంచం ఎక్కేస్తుంటారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, మురికి కాలువలు మూసుకుపోవడం, నిలిచి ఉన్న నీరు, అధిక తేమ ఈడిస్ దోమల సంతానోత్పత్తికి స్థావరాలుగా మారతాయి. ప్రభుత్వం ఏటా డెంగ్యూ నివారణ కోసం ప్రత్యేక ప్రజారోగ్య కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ వైరల్ ఫీవర్ జనాలను బెంబేలెత్తిస్తూనే ఉంది. కనీసం ఈ సీజన్లో అయినా డెంగ్యూ దోమ కాటు నుంచి సురక్షితంగా ఉండాలంటే పాటించాల్సిన నివారణ చర్యలు తెలుసుకోండి.
డెంగ్యూ అంటే ఏమిటి?
ఫ్లేవీ విరస్ కుటుంబానికి చెందిన నాలుగు విభిన్న రకాల వైరస్‌లు డెంగ్యూ జ్వరాన్ని కలిగిస్తాయి. ఈ వైరస్‌లు ప్రధానంగా ఆడ ఈడిస్ ఈజిప్టై దోమల కాటుతో ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత ఆ రకం వైరస్‌పై శరీరానికి రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. అదే రకం మళ్లీ దాడి చేయదు. కానీ మిగతా మూడు రకాల వైరస్‌లతో మాత్రం ఇంకా మూడు సార్లు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకరికి జీవితంలో గరిష్ఠంగా నాలుగు సార్లు డెంగ్యూ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా, రెండోసారి లేదా మూడోసారి వ్యాధి సోకితే అది పూర్తిగా భిన్నమైన వైరస్ వల్ల రావడం వల్ల జ్వరం తీవ్రతరం కావచ్చు.
డెంగ్యూ నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
1. దోమల కాటు నుంచి రక్షణ పొందేందుకు శరీరం మొత్తం కప్పి ఉంచేలా ఫుల్ హ్యాండ్స్ టాప్స్, ఫుల్ ప్యాంట్లు ధరించాలి.
2. దోమ కాటు నివారణకు(mosquito repellents) క్రీములు రాసుకోండి.
3. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. కిటికీలు, తలుపులకు దోమలను అడ్డుకునేలా జాలీలు వేయండి.
4. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండే కంటైనర్లు, జార్లు, కూలర్‌లు ఉంటే తరచూ శుభ్రం చేయండి. కొబ్బరి చిప్పలు, ప్లాస్టి్క్ బాటిళ్లను పారవేయండి.
5. ఇంటి బయట గడ్డి, చెత్త, ఆకులు వంటి దోమల సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలను క్లీన్ చేయండి.
6. ఇంట్లో లిక్విడ్ మోస్కిటో రిపెలెంట్లు, కోయిల్స్, వేపర్స్ వాడండి. అవసరమైతే స్వచ్చంద సంస్థలు లేదా మున్సిపాలిటీ ద్వారా స్ప్రే చేయించండి.
7. ఉదయం 6 నుంచి 10 మధ్య, సాయంత్రం 4 నుంచి 7 మధ్య డెంగ్యూ దోమలు చురుగ్గా ఉంటాయి. ఈ సమయంలో కుట్టకుండా జాగ్రత్త వహించండి.
8. పిల్లలు బయటకు ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు రిపెలెంట్లు, ఫుల్ డ్రెస్సింగ్ ఉండేలా చూడాలి.
9. జ్వరం వస్తే ఎప్పుడూ పారాసిటమాల్ (paracetamol) మాత్రమే వాడాలి. aspirin లేదా ibuprofen డాక్టర్ సలహా లేకుండా తీసుకోవద్దు. (వీటితో బ్లీడింగ్ ప్రమాదం ఉంటుంది).
డెంగ్యూ ముఖ్య లక్షణాలు
అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, మోకాళ్లు, తొడలు, వెన్నెముక, మెడ, తల వెనుక భాగం వంటి చోట్ల తీవ్రమైన నొప్పులు, తల నొప్పి, కళ్ల వెనుక భాగంలో నొప్పి, ఉబ్బసం, వాంతులు, అలసట, ఆకలిగా అనిపించకపోవడం, చర్మంపై ఎర్రటి రాషెస్, మూత్రంలో, వాంతి, ముక్కులో రక్తస్రావం, దంతాల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి. జ్వరం 3 రోజులకు పైగా కొనసాగితే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!
For More Latest News