YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:11 PM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్, డిసెంబరు 20: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఈ కేసు అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ, తుది దశకు చేరుకోకపోవడం రాజకీయ, న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
తాజాగా నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయాధికారి రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావును నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత న్యాయాధికారి ఈ నెల 22 తర్వాత రిలీవ్ కావాలని, 29వ తేదీ లోగా నూతన వ్యక్తి పోస్టింగ్‌లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మార్పుతో జగన్ అక్రమాస్తుల కేసు విచారణను మరోసారి కొత్త న్యాయాధికారి ప్రారంభించనున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో కూడా పలుమార్లు న్యాయాధికారులు మారడంతో విచారణ ప్రతిసారి మొదటి నుంచి ప్రారంభమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి కేసు కొనసాగుతున్నా, ప్రధాన కేసులు ట్రయల్ దశకు వెళ్లకుండా నిలిచిపోయాయి. దీనికి కారణం పదేపదే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధాన కేసుల విచారణకు వెళ్లకుండా అడ్డుకునేందుకు జగన్ తరఫున వ్యూహాత్మకంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కారణంగా కేసు ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, ఈ కేసు త్వరితగతిన విచారించి తీర్పులు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ ఆదేశాలు అమల్లోకి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. న్యాయాధికారుల మార్పు, డిశ్చార్జ్ పిటిషన్లపై దీర్ఘకాల విచారణ వంటి అంశాల వల్ల జగన్ అక్రమాస్తుల కేసు ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది. ఈ పరిస్థితి న్యాయవ్యవస్థపై ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. రాజకీయంగా కూడా ఈ కేసు ఎప్పుడు ముగుస్తుందన్న అంశం కీలకంగా మారింది. కొత్త న్యాయాధికారి పట్టాభిరామారావు బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా విచారణ వేగవంతమవుతుందా? ప్రధాన కేసులు ట్రయల్‌కు వెళ్లే అవకాశముందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యం అవుతోండటంతో న్యాయ ప్రక్రియపై, కేసు భవితవ్యంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News