Share News

YSRCP Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Dec 22 , 2025 | 09:31 PM

వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 YSRCP  Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
YSRCP Violence

ఏలూరు జిల్లా, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరులు వీరంగం సృష్టించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు పేరుతో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, బైకులకు సైలెన్సర్లు తొలగించి స్థానిక ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు.


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శబ్ద కాలుష్యానికి కారణమైన బైకును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వనిత అనుచరులు పోలీసులను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. బైకును సీజ్ చేస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని దొరసానిపాడు సర్పంచ్ లక్కభత్తుల సిద్దిరాజు అతని అనుచరులతో కలిసి పోలీసులను బెదిరించినట్లు సమాచారం.


బైకుపై పెట్రోల్ పోసి అంటించేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న పోలీసులను నెట్టివేయడమే కాకుండా, వారి కాలర్ పట్టుకుని దాడికి దిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పుతోండటంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


ఈ ఘటనలో దొరసానిపాడు సర్పంచ్ లక్కభత్తుల సిద్దిరాజుతో పాటు మరో ముగ్గురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, పోలీసుల విధులకు అడ్డంకులు కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు జిల్లా పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్‌‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 09:44 PM