Share News

Anitha: డ్రగ్స్‌ విక్రయిస్తే కఠిన చర్యలు.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:00 PM

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్‌పై ఏపీలో నిఘా పెరిగిందని.. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు.

Anitha: డ్రగ్స్‌ విక్రయిస్తే కఠిన చర్యలు..  హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
AP Home Minister Vangalapudi Anitha

అనకాపల్లి జిల్లా, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించాలని సూచించారు. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. ఇవాళ(బుధవారం) అనకాపల్లి జిల్లా వేదికగా ప్రసంగించారు హోంమంత్రి వంగలపూడి అనిత.


‘మన భవిష్యత్ - మన చేతుల్లోనే ఉంది’. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. యువత భవిష్యత్ చాలా ముఖ్యమని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్‌పై ఏపీలో నిఘా పెరిగిందని.. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు. గంజాయి రవాణా చేసిన, గంజాయి సేవిస్తున్నా వెంటనే 1972 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం అందగానే పోలీసులు వస్తారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.


ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీ..

కాగా, ఇవాళ(బుధవారం) మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు హోం మంత్రి అనిత. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 25 రోజుల పాటు, సుమారు 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో విద్యార్థులతో ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతగానో అలరించింది. ‘మాదకద్రవ్యాలు వద్దు - జీవితమే ముద్దు’ అంటూ ఫ్లాష్‌మాబ్‌లో విద్యార్థులు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు హోం మంత్రి అనిత.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...

వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2025 | 01:10 PM