Share News

Srisailam Temple: వరుస సెలవులు.. శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ కలెక్షన్

ABN , Publish Date - Dec 27 , 2025 | 09:46 PM

శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ఆన్‌లైన్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు.

Srisailam Temple: వరుస సెలవులు.. శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ కలెక్షన్
Srisailam Temple

నంద్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి (Srisailam Bhramaramba Mallikarjuna Swamy Temple) ఆలయానికి ఆన్‌లైన్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భౌతిక దర్శనాల ద్వారానే కాకుండా, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ అందిస్తున్న ఆన్‌లైన్ సేవల ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరింది. నిన్న ఒక్కరోజే సుమారు 40 వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ స్థాయి భక్తుల రాకతో ఆలయ పరిసరాలు పూర్తిగా సందడిగా మారాయి. దర్శనాలు, అర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాలు, కేశఖండన వంటి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


రికార్డు స్థాయి ట్రాన్సాక్షన్లు

ప్రత్యేకంగా మనమిత్ర యాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సేవలకు విశేష స్పందన లభించింది. ఒక్కరోజులోనే సుమారు రూ.12 వేలకుపైగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఈ ఆన్‌లైన్ సేవల ద్వారా భక్తులు ముందుగానే దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం, లడ్డూ ప్రసాదాలు, అర్జిత సేవలు, కేశఖండన టికెట్లను సులభంగా పొందారు. ఆన్‌లైన్ విధానంతో భక్తులకు క్యూలలో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా సేవలు అందాయి.


పెరిగిన భక్తులు..

ఆలయ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజులోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా కోటి 46 లక్షల 94 వేల రూపాయల ఆదాయం వచ్చింది. భక్తుల సంఖ్య పెరగడం, ఆన్‌లైన్ సేవల వినియోగం విస్తృతం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఆలయ అధికారులు చెబుతున్నారు.


ఆన్‌లైన్ సహాయ కేంద్రాలు..

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ క్షేత్ర పరిధిలో ఆన్‌లైన్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో భక్తులకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, సేవల వివరాలు, మనమిత్ర యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం లేని భక్తులకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.


ఆలయ ఈవో, చైర్మన్ సూచనలు

ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ రమేశ్ నాయుడు మాట్లాడారు. భక్తులు ఎక్కువగా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ విధానం ద్వారా భక్తులకు సమయం ఆదా అవుతుందని, దర్శనాలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 09:53 PM