YS Sharmila on Kurupam incident: గిరిజన బిడ్డల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలి: షర్మిల
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:22 AM
గిరిజన బిడ్డల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గిరిజన బిడ్డలు ఏం తింటున్నారో చూసే పర్యవేక్షణ ఈ ప్రభుత్వానికి అసలే లేదని వైఎస్ షర్మిల విమర్శించారు.
విజయవాడ, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): గిరిజన బిడ్డల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. గిరిజన బిడ్డలు ఏం తింటున్నారో చూసే పర్యవేక్షణ ఈ ప్రభుత్వానికి అసలే లేదని విమర్శించారు. సంక్షేమ బడుల్లో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లభించడం లేదని చెప్పుకొచ్చారు. గిరిజన బిడ్డల కడుపునకు బుక్కెడు అన్నం పెట్టడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గిరిజన బిడ్డల సంక్షేమం పట్టదా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు తాగి ఇద్దరు విద్యార్థినులు మరణించిన ఘటనపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు. పాలన వైఫల్యంతో ముక్కుపచ్చలారని బిడ్డలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 128 మంది గిరిజన బిడ్డలు ఆస్పత్రుల పాలయ్యారంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. చనిపోయిన బిడ్డల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
అత్యవసర వార్డుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలకు మెరుగైన వైద్యం అందేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ ఘటన మరోచోట పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరుపాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రోగాలపై నెట్టి తప్పుకుందామని చూస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. గిరిజన బిడ్డలపై కూటమి ప్రభుత్వానికి అంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. అవి వసతి గృహాలు కాదని.. సమస్యలకు లోగిళ్లని విమర్శించారు. గురుకులాల పేరు చెబితేనే బిడ్డలు వణుకుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోందని షర్మిల విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News