Land Dispute: విజయవాడలో భూమాయ.. కలెక్టర్ ఆదేశాలతో విచారణ మొదలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 07:18 AM
జాతీయ రహదారి-16 విస్తరణలో భాగంగా విజయవాడ పశ్చిమ బైపాస్ కోసం విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో సేకరించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి తలపెట్టిన ప్రయత్నానికి రెవెన్యూ అధికారులు బ్రేక్ వేశారు.
» ఎన్‌హెచ్ విస్తరణకు సేకరించిన భూమి విక్రయించే యత్నం
» భూమిని ఇచ్చినట్టే ఇచ్చి.. పరిహారం కూడా పొంది..
» అందులోని మూడు సెంట్లు విక్రయించే పన్నాగం
» రిజిస్ట్రేషను నిలిపివేయాలని రూరల్ తహసీల్దార్ లేఖ
» కలెక్టర్ లక్ష్మీశను వివరణ కోరిన చీఫ్ సెక్రటరీ
» కలెక్టర్ ఆదేశాలతో విచారణ మొదలు
జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమిని ఓ ప్రైవేట్ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. దీనిపై చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లగా, ఆయన కలెక్టర్ లక్ష్మీశను సమాచారం కోరారు. కలెక్టర్ విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో విజయవాడ రూరల్ మండల తహసీల్దార్ నున్న సబ్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. దీంతో బైపాస్ స్థలం ఆక్రమ రిజిస్ట్రేషనుకు బ్రేక్ పడింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జాతీయ రహదారి-16 విస్తరణలో భాగంగా విజయవాడ పశ్చిమ బైపాస్ (Vijayawada West Bypass) కోసం విజయవాడ రూరల్ మండలం అంబాపురం (Ambapuram) గ్రామంలో సేకరించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి తలపెట్టిన ప్రయత్నానికి రెవెన్యూ అధికారులు బ్రేక్ వేశారు. జాతీయ రహదారి నిమిత్తం సేకరించిన భూమికి రిజిస్ట్రేషన్ చేయొద్దని కోరుతూ నున్న సబ్ రూరల్ తహసీల్దార్ సుగుణ లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
కథ ఇది..
విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని ఎల్‌పీఎం నెంబర్ 629 (పాత సర్వే నెంబర్ 14/1ఎఫ్3) భూమికి సంబంధించిన వివాదమిది. ఈ సర్వే నెంబర్లోని 3సెంట్ల స్థలాన్ని తనదిగా చెప్పుకొంటున్న చాగంటి లక్ష్మారెడ్డి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. సర్వే నెంబర్ 14/1ఎఫ్2 సీలోని 1012 చదరపు మీటర్ల (0.25 ఎకరాలు) భూమిని ఇప్పటికే విజయవాడ పశ్చిమ బైపాస్ కోసం తీసుకున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవార్డు నెంబర్ 12/2013 ద్వారా 47.88 కిలోమీటర్ల వరకు భూమిని సేకరించగా, అందులో అంబాపురం గ్రామంలో మొత్తం 49 సర్వే నెంబర్ల పరిధిలో 1,13,274 చదరపు మీటర్ల స్థలాన్ని తీసుకుంది.
ఇందులో భాగంగా చాగంటి లక్ష్మారెడ్డికి సంబంధించిన 1,012 చదరపు మీటర్ల స్థలాన్ని సేకరించినట్టు రెవెన్యూ యంత్రాంగం తన అవార్డు కాపీలో పేర్కొంది. దీనిని బట్టి చూస్తే లక్ష్మారెడ్డికి 3 సెంట్ల స్థలం ఉండే అవకాశం లేదు. తనకున్న పాతిక సెంట్లను తీసుకున్నపుడు ఆయనకు 3 సెంట్లు ఎలా మిగులుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. భూమి సేకరణ అనంతరం 2013, నవంబరు 4 నాటికి చాగంటి లక్ష్మారెడ్డికి ఎల్‌పీఎం నెంబర్ 629లో ఏ విధమైన భూమి లేదని, ఇప్పుడు అదే సర్వే నెంబరు (రీ సర్వే ఎల్‌పీఎం నెంబర్ 629) 3 సెంట్ల భూమి ఉందంటూ టైటిల్ లేకుండా విక్రయించటానికి ప్రయత్నిస్తున్నాడని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ భూమిని పశ్చిమ బైపాస్ కోసం తీసుకున్నారు కాబట్టి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణం నిలిపివేయాల్సిందిగా సూచించారు.
రీ సర్వేలో మాయ
ఇటీవల జరిగిన రీ సర్వేలో లక్ష్మారెడ్డికి 3 సెంట్లు ఉన్నట్లు రికార్డులకెక్కింది. ఇది ఎవరు చేశారన్నది తేలాల్సి ఉంది. దీనిని అడ్డం పెట్టుకుని లక్ష్మారెడ్డి ఈ స్థలాన్ని వేరొకరికి విక్రయానికి పెట్టారు. దీనికోసం నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు పూనుకున్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి పరిశీలన జరిపాక, ఈ స్థలం లేదని తెలిసింది. దీనిపై అంతర్గత విచారణకు తహసీల్దార్ ఆదేశించటంతో పాటు నున్న సబ్ రిజిస్ట్రారు లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: సింగపూర్ మంత్రులను బెదిరించారు
AG Dammalapati Srinivas: పారిశ్రామిక పాలసీ ప్రకారమే లులూకు భూమి
For More AP News and Telugu News