AG Dammalapati Srinivas: పారిశ్రామిక పాలసీ ప్రకారమే లులూకు భూమి
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:31 AM
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే విశాఖ, విజయవాడ నగరాల్లో లులూ సంస్థకు భూకేటాయింపులు చేశామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టుకు నివేదించారు.
హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్
ఆ సంస్థకు భూకేటాయింపులపై కౌంటర్ దాఖలు చేయండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. లులూకు నోటీసులు
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే విశాఖ, విజయవాడ నగరాల్లో లులూ సంస్థకు భూకేటాయింపులు చేశామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టుకు నివేదించారు. గతేడాది డిసెంబరులో తీసుకొచ్చిన పాలసీకి అనుగుణంగా అత్యంత భారీ, భారీ, మధ్యతరహా పరిశ్రమలకు భూకేటాయింపులు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం లులూ సంస్థకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. విశాఖ నగరంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు లులూ గ్రూపు చేసిన ప్రతిపాదనలను ఆమోదించి, తక్కువ ధరకు 13.5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతోందని పేర్కొంటూ పాకా సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లీజు రెంటల్ విధానంలో లులూ సంస్థకు కేటాయిస్తూ పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనశాఖ ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్ వెంకటేశ్వరరావు మరో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. లులూకు భూకేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ విధానాన్ని అనుసరించలేదన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలోనూ ఆసంస్థకు భూమి కేటాయించలేరన్నారు.