Share News

Garuda Varalakshmi: సంగీత వరలక్ష్మి

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:16 AM

ఆమె సరస్వతీ పుత్రిక. గొప్ప మధురస్వరం ఆ పరమేశ్వరుడు ఆమెకిచ్చిన వరం. గత 60 ఏళ్లుగా

Garuda Varalakshmi: సంగీత వరలక్ష్మి

  • 60 ఏళ్లుగా గానమాధుర్యం

  • దేశ, విదేశాల్లో సంగీత కచేరీలు.. కొన్ని వేల గీతాలాపన

  • కూటమి గెలిస్తే 108 క్షేత్రాలలో కచేరీలు చేస్తానని మొక్కు

  • నేడు దుర్గమ్మ సన్నిధిలో చివరి కచేరి

  • చంద్రబాబుతో ఫొటో దిగితే చాలంటున్న వరలక్ష్మి

  • ‘ఆంధ్రజ్యోతి’తో ముఖాముఖి

(మంగళగిరి-ఆంధ్రజ్యోతి): ఆమె సరస్వతీ పుత్రిక. గొప్ప మధురస్వరం ఆ పరమేశ్వరుడు ఆమెకిచ్చిన వరం. గత 60 ఏళ్లుగా తన గానమాధుర్యంతో సంగీత కళా ప్రేక్షకుల్ని ఓలలాడిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనలు, మంగళహారతులు, ఇతర ప్రార్థనా గీతాలు, లైట్‌ మ్యూజిక్‌ పాటలను పాడటంలో ఆమెకు ఆమే సాటి. ఆ గాన సరస్వతి పేరు వరలక్ష్మి నారాయణమ్‌. గుంటూరు జిల్లా మంగళగిరిలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె దేశవ్యాప్తంగా సంగీత కచేరీలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని వేల గీతాలను ఆలపించారు. పాట అంటే గౌరవం, భక్తి ఉన్నాయి కాబట్టే తనకిది సాధ్యమైందని అంటున్నారు. సంగీత కచేరీలంటే.. ఫంక్షన్‌లకు, వాణిజ్య పరమైన ప్రోగ్రామ్‌లకు అంగీకరించరు. కేవలం హిందూ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాలలోనే గాన కచేరీలు నిర్వహిస్తారు.

కూటమి కోసం వాగ్దానం

ఓ ప్రత్యేకత ఏంటంటే... వరలక్ష్మి నారాయణమ్‌ తాను చేసిన ఓ వాగ్దానాన్ని గురువారంతో నెరవేర్చుకోబోతున్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఎన్నికలకు ముందు కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలోని 108 పుణ్యక్షేత్రాలలో గాన కచేరీలు చేస్తానని మొక్కుకున్నారు. ఇప్పటి వరకూ 107 పుణ్యక్షేత్రాలలో నిర్వహించారు. గురువారం విజయవాడలోని కనకదుర్గమ్మ దేవస్థానంలో తన మొక్కుబడి తాలూకు చివరి, 108వ కచేరి నిర్వహించనున్నారు. దీంతో ఆమె వాగ్దానం పూర్తిగా నెరవేరనుంది. ఈ కచేరీ కోసం బుధవారం ముంబై నుంచి మంగళగిరిలోని తన సోదరుడు, న్యాయవాది శ్రీభాష్యం రంగనాథ్‌ నివాసానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి తన భావాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. తన మొక్కు చెల్లించుకునే క్రమంలో మొదటి సంకీర్తన కార్యక్రమాన్ని అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం నుంచి ప్రారంభించానని వరలక్ష్మి తెలిపారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశంలోని 150 గొప్ప పుణ్యక్షేత్రాలలో భక్తి గీతాలాపాన చేసిన సువర్ణావకాశం తనకు లభించిందన్నారు. లాభాపేక్ష లేకుండా...


ముంబైలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు శిక్షణ ఇచ్చి వారితో కలిసి ఓ గ్రూపుగా వివిధ దేవాలయాలలో భక్తి పాటలను ఆలపిస్తున్నట్టు ఆమె వివరించారు. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం ఆత్మసంతృప్తి కోసం తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. ఆలయాలలో సంగీత కచేరీలతో పాటు భరతనాట్యం చేసేందుకు ఆసక్తి చూపే వారిని కూడా ప్రోత్సహిస్తూ వారికి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తన ప్రయాణంలో మహిళల ప్రతిభను ప్రోత్సహిస్తానన్నారు. గీతాలాపనతో పాటు వేంకటేశ్వరస్వామి, రాఘవేంద్రస్వామి, శ్రీ షిరిడిసాయినాథుడి మీద తానే సొంతంగా పాటలు రాసి ఆలపిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తన వయసు 65 ఏళ్లని, ఈ వయసులోనూ ఇంత ఉత్సాహంగా, వేగంగా పని చేస్తున్నానంటే సంగీతం పట్ల తనకున్న మక్కువే కారణమని చెప్పారు. కూటమి విజయం కోసం తాను చేసుకున్న మొక్కుబడి గురువారంతో తీరనున్న సందర్భంగా ఎంతో సంతోషంతో ఉన్నానన్నారు. చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఓ చిన్న ఫొటో దిగాలన్న ఆకాంక్ష తనకుందని వెల్లడించారు. తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా రాష్ట్ట్రం కోసం పరితపించే నిస్వార్థ ప్రజా నాయకుడు చంద్రబాబును తాను ఎంతో గౌరవిస్తానని వరలక్ష్మి తెలిపారు.

FDAGNA.jpg

ఎన్నో ప్రత్యేకతలు

మన దేశంలోనే కాకుండా సింగపూర్‌, మస్కట్‌, నేపాల్‌, దుబాయ్‌ వంటి దేశాలలో వరలక్ష్మి కచేరీలు నిర్వహించారు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఇప్పటి వరకు 35 మంది పీఠాధిపతుల సమక్షంలో ఎన్నో వేల భక్తిగీతాలను ఆలపించారు. తరిగొండ వెంగమాంబ పాటల్ని తొలిసారిగా సప్తగిరి చానల్‌లో ఆలపించిన ఘనత కూడ ఆమె సొంతం. ఇక వివిధ రేడియో, టీవీ చానళ్లలో లెక్కలేనన్ని ప్రోగ్రామ్‌లు చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దా సరి నారాయణరావు వంటి సినీ ప్రముఖులతో పాటు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీ, రోశయ్య వంటి రాజకీయ ప్రముఖుల సమక్షంలో వరలక్ష్మి తన గాన మాధుర్యాన్ని వినిపించారు.

Updated Date - Aug 07 , 2025 | 05:16 AM