Seethampeta: చీమలతో పసందైన విందు
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:20 AM
చీమల దండును చూస్తే ఆమడ దూరం వెళ్లిపోతారు ఎవరైనా. ఇక చెట్లపై ఆకుల్లో గూడులు కట్టే పుల్లేరు (పుల్ల) చీమల జోలికి అస్సలు పోరు. అవి కుడితే వచ్చే మంట తట్టుకోవడం మామూలు విషయం కాదు.
పిపీలికాలతో షడ్రసోపేత వంటకాలు
గుడ్లతో కలిపి పులుసు, పచ్చడి, కూర, వేపుడు
మన్యంలో కొనసాగుతున్న పాత అలవాట్లు
ఆరోగ్యానికి ఎంతో మేలంటున్న గిరిపుత్రులు
(సీతంపేట రూరల్, ఆంధ్రజ్యోతి)
చీమల దండును చూస్తే ఆమడ దూరం వెళ్లిపోతారు ఎవరైనా. ఇక చెట్లపై ఆకుల్లో గూడులు కట్టే పుల్లేరు (పుల్ల) చీమల జోలికి అస్సలు పోరు. అవి కుడితే వచ్చే మంట తట్టుకోవడం మామూలు విషయం కాదు. కానీ, అలాంటి పుల్లేరు చీమలను చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని గిరిపుత్రులకు నోరూరుతుంది. పిపీలికాలతో చేసిన షడ్రసోపేతమైన వంటకాలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. వెంటనే చెట్లపై ఉన్న ఆ పుల్లేరు చీమల గూడులను లాఘవంగా సేకరిస్తారు. ఇంటికి తీసుకెళ్లి పసందైన వంటకం చేసుకుని విందారగిస్తారు. సాధారణంగా మన్యం ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయలు, ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టులాంటివి మైదాన ప్రాంతాల్లో నివసించే ప్రజలకంటే భిన్నంగా ఉంటాయి. ఓ పక్క ఆధునికతకు అలవాటు పడుతూనే, మరోపక్క పురాతన గిరిజన సంప్రదాయాలను అక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. సీతంపేట మన్యంలో నివసిస్తున్న ఆదివాసీలు చీమలను ఎంతో ఇష్టంగా వండుకుని తినడం వెనుక పలు నమ్మకాలు దాగి ఉన్నాయి.
ఆరు రకాల వంటకాలు
సీతంపేట మన్యం ఆదివాసీలు ఆహార వేటలో భాగంగా అటవీ ప్రాంతంలోని చెట్టు కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న పుల్లేరు చీమలను సేకరించి ఆరు రకాల వంటకాలను వండి ఇష్టంగా ఆరగిస్తున్నారు. పుల్లేరు చీమలు, అవిపెట్టే గుడ్లతో పచ్చడి, సూప్, చీమల వేపుడు, కూర, సాంబారు, పప్పు వంటి వంటకాలను వండుతున్నారు. మరి కొందరైతే అడవిలో సేకరించిన పుల్లేరు చీమలను, అవిపెట్టే గుడ్లను బతికుండగానే తినడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నాలుగు నెలలు ఎక్కువగా లభ్యం..
ప్రతీ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో గిరిపుత్రులు ఈ పుల్లేరు చీమల వేటలో నిమగ్నమై ఉంటారు. ఈ నాలుగు నెలల్లోనే ఈ చీమల సంతతి ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ నెలల తరువాత పుల్లేరు చీమలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతాయని అంటున్నారు. చీమల వేటలో భాగంగా గిరిజనులు వ్యయప్రయాసలకు ఓర్చి అతికష్టం మీద చీమల గూళ్లను సేకరిస్తారు. సేకరించిన గూళ్లకు మంట పెట్టి చీమలతో పాటు అవిపెట్టే గుడ్లను వేరుచేస్తారు. చీమలు, వాటి గుడ్ల సైజును బట్టి ఏయే రకాల వంటకాలు వండాలో గిరిజన మహిళలు నిర్ణయిస్తారు. పుల్లేరు చీమలతో వండిన వంటకాలను చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కుటుంబసభ్యులు అందరు కలిసి ఇష్టంగా ఆరగిస్తారు.
పుల్లేరు చీమలను ఇష్టంగా తింటాం
ప్రతీ ఏడాది తమ గ్రామంలోని చిన్న, పెద్ద అందరం ఎంతో ఇష్టంగా ఈ పుల్లేరు చీమలను తింటామని కారెం కొత్తగూడ గ్రామానికి చెందిన సవర మధు, సవర శ్రీను అనే గిరిజనులు తెలిపారు. చీమల వంటకాలను తమతో పాటు తమ బంధువులకు కూడ వండి వడ్డిస్తామని చెబుతున్నారు. పుల్లేరు చీమలను తినడం వలన శరీరంలో విటమిన్ ఎ, విటమిన్ సి వృద్ధి చెందుతాయని తెలిపారు. అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పుల్లేరు చీమల్లో పుష్కలంగా ఉంటాయనేది తమ నమ్మకమని చెబుతున్నారు.
ఆరోగ్యంపై విశ్వాసం
పుల్లేరు చీమలను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గిరిపుత్రులు విశ్వసిస్తారు. ఏటా ఈ సీజన్‌లో చీమలను తింటే దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు. చీమలు, వాటి గుడ్లను కలిపి తినడం వలన షుగర్, బీపి, చర్మవ్యాధులు దరిచేరవని వారి ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా కంటిచూపు ఎప్పటికీ మందగించదని కొత్తగూడ గ్రామానికి చెందిన గిరిజనులు చెబుతున్నారు. బతికున్న పుల్లేరు చీమలు, వాటి గుడ్లను తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయని అంటున్నారు.
