CM Chandrababu: సింగపూర్ మంత్రులను బెదిరించారు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:11 AM
వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం, సింగపూర్ మంత్రులపైనే కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వ పెద్దలు సీరియ్‌సగా తీసుకున్నారని...
వారిపై కేసులు పెడతామన్నారు.. జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది
క్యాబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం
ఆ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారు
దీంతో వారు సీరియ్‌సగా తీసుకున్నారు
దీనివల్లే అమరావతి పనుల్లో నేరుగా భాగస్వాములయ్యేందుకు విముఖత
సీడ్ క్యాపిటల్‌లో పెట్టుబడులకూ అనాసక్తి
కావాలంటే ప్రపంచబ్యాంకు ద్వారా సాయం చేస్తామంటున్నారు
అయినా విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఒప్పించాం
ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణకు కసరత్తు
నలుగురేసి మంత్రులతో బృందాలను పంపుతాం: సీఎం
సింగపూర్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగా క్యాబినెట్ మంత్రులను నలుగురైదుగురు చొప్పున బృందాలుగా సింగపూర్‌కు పంపాలని నిర్ణయించాం. సింగపూర్ ప్రభుత్వం కూడా మంత్రులను పంపాలని కోరింది.
వైసీపీ నేతలు రోజురోజుకూ వికృతంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను బూతులు తిట్టడం, అసభ్యంగా వ్యవహరించడం వంటివి చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో మంత్రులు ముందుండాలి.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం, సింగపూర్ మంత్రులపైనే కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వ పెద్దలు సీరియ్‌సగా తీసుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. తన సారథ్యంలోని మంత్రులు, అధికారుల బృందం ఇటీవల సింగపూర్‌లో పర్యటించిన తాలూకు విశేషాలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన పంచుకున్నారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ చేసిన నష్టం పూడ్చలేని విధంగా ఉంది. ఈ కారణంగా సింగపూర్ వారు నేరుగా రాజధాని అమరావతి పనుల్లో భాగస్వాములయ్యేందుకు విముఖత చూపుతున్నారు. నా పర్యటన ద్వారా వారితో సంబంధాలను కొంత వరకు గాడిలో పెట్టగలిగాం. కానీ రాజధాని సీడ్ క్యాపిటల్‌లో పెట్టుబడులకు గానీ, కంపెనీలను తీసుకొచ్చేందుకు గానీ వారు ఇష్టపడడం లేదు. అవసరమైతే ప్రపంచబ్యాంకు ద్వారా సహకారం అందిస్తామని చెబుతున్నారు. అయినా విశాఖపట్నంలో నవంబరులో జరిగే బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు సింగపూర్‌ను ఎట్టకేలకు ఒప్పించగలిగాం’ అని చెప్పారు.
క్రిమినల్స్‌తో రాజకీయాలు కలుషితం
‘క్రిమినల్స్ చాలా తెలివిమీరిపోతున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి కలుషితం చేస్తున్నారు. ఈ పరిణామాలను దీటుగా ఎదుర్కొనేందుకు రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని, పోలీసులు కూడా క్రిమినల్స్‌కు దీటుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని సీఎం అన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో మంత్రులు ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాది గడిచిపోతున్నా చాలా మంది మంత్రులు ఇంకా యాక్టివ్ కావడం లేదని.. అలాంటి వారు స్పీడ్ పెంచాలని సూచించారు. చాలా మంది ఏడాది కాలంలో మంచి పనితీరు కనబరిచారని, ఇకపై మరింత దూకుడు చూపాల్సి ఉందన్నారు. మంత్రులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకుని వాటిని పూర్తి చేసేందుకు నిర్ణీత గడువు పెట్టుకుని పనిచేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే క్యాబినెట్ సమావేశం నుంచి ఒకరిద్దరు మంత్రులను వారి వారి శాఖల్లో పురోగతిపై మాట్లాడాలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సిద్ధమై రావాలని వారికి సూచించారు.
పార్టీ అడిగి ఫొటోలు దిగుతామా?
లిక్కర్ స్కాం నిందితుడు వెంకటేశ్ నాయుడు సీఎం చంద్రబాబుతో దిగిన ఫొటోలను చూపి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఎవరెవరో వచ్చి ఫొటోలు దిగుతుంటారని వారిని నీవు ఏ పార్టీ అని అడిగి ఫొటోలు దిగలేం కదా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వెంకటేశ్‌నాయుడు నంద్యాలకు చెందిన వాడు కావడంతో అక్కడి మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌తో కూడా ఫొటోలు దిగి ఉంటారని ఆయన అనగా.. వారిద్దరూ స్పందించారు. స్థానికంగా తమకు ఎవరు ఏ పార్టీవారో కాస్త అవగాహన ఉంటుందని, తమ పార్టీ కాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వమని, వెంకటేశ్‌నాయుడితో తాము ఫొటోలు దిగలేదని స్పష్టంచేశారు. ఫొటోల విషయంలో తనతోపాటు మంత్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోందని సీఎం అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టులో సీబీఐ కేసు విచారణ ముగిసిందని చెప్పడంపై క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్చ నడుస్తోందని సీఎం మంత్రులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాల పునర్విభజన అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నెల రోజుల్లో తమ నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం వల్ల ఆటో కార్మికులపై ప్రభావం పడుతుందని.. వారితో చర్చించి వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాబినెట్ దృష్టికి తీసుకురాగా తప్పకుండా చేద్దామని సీఎం హామీ ఇచ్చారు.
2014-19కి సంబంధించిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను కేంద్రంతో మాట్లాడి ఎట్టకేలకు కొలిక్కి తీసుకొచ్చామని, ఆగస్టు 25లోపు వీటన్నింటినీ చెల్లించాలని, ఈ మేరకు మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం అన్నారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లను వారికే దక్కేలా చూడాలని, బినామీల ప్రమేయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారంలో అసెంబ్లీ
క్యాబినెట్ సమావేశానికి ముందు సీఎం నివాసంలో మంత్రులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగింది. ఈ నెల 15 వరకు ఏకబిగిన కార్యక్రమాలు ఉన్నాయని, ఆ తర్వాత సమావేశాలు పెడితే బాగుంటుందని పలు వురు మంత్రులు సూచించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నెలాఖరులో లేదా సెప్టెంబరు మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా రెండు ప్రతిపాదనలను సీఎంకు, లోకేశ్‌కు సమర్పించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు తేదీ ఖరారు కానుంది.