Raghurama Krishna Raju: పరువు, ప్రతిష్ఠలపై జగన్ మాట్లాడటం సరికాదు
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:53 AM
జైలులో పెట్టడం అంటే పరువు, ప్రతిష్ఠ దెబ్బ తీయడమేనని జగన్మోహన్‌రెడ్డి అద్భుతమైన పదాలను వాడుతున్నారు. మరి గతంలో నా మీద రాజద్రోహం కేసు పెట్టి, హఠాత్తుగా ఏ నోటీసులూ ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేయించారు?
నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు
ఇప్పుడు చట్టబద్ధంగా చేస్తున్నా విమర్శలా?: రఘురామకృష్ణరాజు
కాళ్ల, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘జైలులో పెట్టడం అంటే పరువు, ప్రతిష్ఠ దెబ్బ తీయడమేనని జగన్మోహన్‌రెడ్డి అద్భుతమైన పదాలను వాడుతున్నారు. మరి గతంలో నా మీద రాజద్రోహం కేసు పెట్టి, హఠాత్తుగా ఏ నోటీసులూ ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేయించారు?’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. ‘గతంలో నన్ను అరెస్ట్ చేయించిన జగన్... ఇప్పుడు జరుగుతున్న అరెస్టులను చూసి తెగ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం ఎవరు, ఏ తప్పు చేసినా వారికి నోటీసులు ఇచ్చి, సుప్రీం కోర్టు వరకు వెళ్లే వెసులుబాటు కల్పించి, అరెస్టు చేసిన తర్వాత కూడా వారికి సకల రాజభోగాలను అనుభవించే అవకాశాన్ని కల్పిస్తున్నారన్నారు. కానీ గతంలో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాజద్రోహం కేసు నమోదు చేశారు. చంపేయమని చెప్పి... చితక్కొట్టి, కాళ్లు వాచిపోయేలా చావగొట్టారు. నాకు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స చేస్తుంటే మళ్లీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని ఆ ఆసుపత్రి చుట్టూ పోలీసు మూకలను కాపలా పెట్టారు. ఇంత చేసి... ఇప్పుడు ఈ నిర్వేదం ఏమిటి? సీఎం చంద్రబాబు తప్పు చేస్తున్నారని మాట్లాడడం ఏమిటి? జగన్మోహన్‌రెడ్డి చేసిన అన్యాయాలను ఎలుగెత్తి చాటేందుకు నేను పెట్టిన యాప్ పేరే రచ్చబండ. ఆ యాప్ ద్వారా నేను ప్రజల మనోభావాల్ని, ఎవరెవరు ఆనాటి ప్రభుత్వ విధానాల వల్ల బాధపడుతున్నారో వివరించా. ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, తప్పు లు సరిచేసుకొమ్మని చెప్పినందుకే కేసులు పెట్టి వేధించారు. మద్యం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన వారిని కూడా జగన్ సమర్థిస్తున్నారు’ అని డిప్యూటీ స్పీకర్ విమర్శించారు.