Indrakiladri: ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:56 PM
దసరా ఉత్సవాల సందర్భంగా చేపట్టే పనులు శరవేగంగా జరిగే విధంగా చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు 11 రోజులు జరుగనున్నాయని తెలిపారు. గతం కంటే ఘనంగా ఉత్సవాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
విజయవాడ,ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల సందర్భంగా చేపట్టే పనులు శరవేగంగా జరిగే విధంగా చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే దసరా మహోత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. వన్ టౌన్ బ్రాహ్మణవీధి జమ్మిదొడ్డి మీటింగ్ హాల్‌లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు సుజనా చౌదరి, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్, దేవాదాయ శాఖ కమిషనర్ రామ చంద్ర మోహన్, దుర్గ గుడి ఈవో శీనా నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

11 రోజుల పాటు దసరా ఉత్సవాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు 11 రోజులు జరుగనున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గతం కంటే ఘనంగా ఉత్సవాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దసరా ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. మూలా నక్షత్రం, విజయ దశమి రోజుల్లో ప్రతీ భక్తునికి ఉచిత లడ్డూ ప్రసాదం అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక ఉత్సవ సన్నద్ధత అన్నిశాఖల్లో ఉండాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందజేయాలని సూచించారు. దుర్గమ్మ దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రకాశం బ్యారేజ్, దేవస్థాన ప్రాంగణం చక్కగా విద్యుత్ వెలుగులతో ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైదిక కార్యక్రమాలు చక్కగా జరిగేలా స్థానాచార్య, వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు బాధ్యత వహించాలని సూచించారు. దసరా సందర్భంగా కృష్ణా హారతులను వైభవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్గనిర్దేశం చేశారు.
విజయవాడ ఖ్యాతి పెంచేలా దసరా ఉత్సవాలు: ఎమ్మెల్యే సుజనా చౌదరి

దసరా ఉత్సవాలకు ఈ సారి ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. పారిశుధ్య ఏర్పాట్లు చక్కగా చూడాలని వీఎంసీ అధికారులను సూచించామని అన్నారు. దాతల సహకారం కూడా తీసుకుంటున్నామని.. విజయవాడ ఖ్యాతి పెంచేలా దసరా ఉత్సవాల నిర్వహణ జరగాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News