Kanaka Durga Temple: దుర్గగుడిలో భద్రతా విఫలం.. భక్తుల్లో భయం
ABN , Publish Date - Aug 09 , 2025 | 07:40 AM
దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల లగేజీకి భద్రత కరువైంది. రోజూ వేలమంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఆలయంలో తమ బ్యాగులకు కనీస భద్రత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
» గుట్టలుగా బ్యాగులు.. నిర్లక్ష్యానికి నిదర్శనం
» భక్తుల లగేజీకి భద్రత ఎంత?
» కాంట్రాక్టరు, సిబ్బంది నిర్వహణ లోపం
» క్లోక్ రూంలో మాయమవుతున్న లగేజ్
" మౌలిక సౌకర్యాల కల్పనపై భక్తుల ఆగ్రహం
» దసరా ఉత్సవాలకైనా చక్కదిద్దాలని వినతి
ఇంద్రకీలాద్రి, ఆగస్టు 8, (ఆంధ్రజ్యోతి): దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో (Kanaka Durga Temple) భక్తుల లగేజీకి భద్రత కరువైంది. రోజూ వేలమంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఆలయంలో తమ బ్యాగులకు కనీస భద్రత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ ప్రతం విశిష్టత సందర్భంగా వేలాది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. దేవస్థానంలో కొండపైన ఒకటి, కొండ దిగువన ఒకటి లగేజీ బ్యాగులు భద్రపరచుకునే పాయింట్లు ఉన్నాయి.
అయితే బ్యాగులు ఉంచేందుకు సరిపడాలేని ఏర్పాట్లు, సిబ్బంది కొరత ఉంది. వేలాదిమంది భక్తులు వస్తారన్నది తెలిసి కూడా దేవస్థానం అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సంబంధిత కాంట్రాక్టరు తనకేమి పట్టనట్టు తూతూమం త్రంగా ఏర్పాట్లు చేసి చోద్యం చూస్తున్నారు. ఒకవైపు దేవస్థానం అధికారులు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా అమలులో చిత్త శుద్ధి కనిపించడంలేదు.
గుట్టలు గుట్టలుగా బ్యాగులు పడవేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాగుకు రూ.15లు రుసుం వసూలు చేసినప్పటికీ కనీన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. వాస్తవంగా దేవస్థాన రుసుము బ్యాగుకు, రూ.10కాగా అధికంగా రూ.15 వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. రశీదు కూడా ఇవ్వకుండా పేపరు రాసి ఇస్తున్నారు. పీఠాపురానికి చెందిన గంగాధర్ కుటుంబసభ్యులతో దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. నాలుగు బ్యాగులను క్లోక్ రూమ్‌లో భద్రపరచి దర్శనానికి కొండపైకి వెళ్లారు. దర్శనానంతరం క్లోక్ రూమ్ వద్దకు వచ్చి చూడగా రెండు బ్యాగులు మాయమయ్యాయి.
బాధితుడు సిబ్బందిని ప్రశ్నించగా అవి ఏమయ్యాయో తమకు తెలియదంటూ బూకాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేయగా బ్యాగులు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. ఒక్కొక్క బ్యాగుకు రూ.15ల చొప్పున వసూలు చేశారని గంగాధర్ కుటుంబసభ్యులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన రావులస్వామి కుటుంబసభ్యులతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆరు బ్యాగులను బ్లాక్ రూమ్‌లో భద్రపరచగా సిబ్బంది అతని నుంచి మొత్తం రూ.100ల వసూలు చేశారు. దీనిపై రావులస్వామి క్లోక్ రూమ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల నుంచి ఇష్టానుసారంగా అదనపు రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Raksha Bandhan 2025: అనుబంధాలకు గుర్తుగా రక్షాబంధన్ వేడుకలు
AP Government Schools: ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం
For More AP News and Telugu News