Hero Suman on Politics : రాజకీయాల్లోకి రావడం దేవుని సంకల్పమే.. హీరో సుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:56 PM
తాను రాజకీయాల్లోకి రావడం ఆ దేవుని దయ అని.. హీరోగా ఎదగటానికి కూడా దైవ సంకల్పమే కారణమని ప్రముఖ సినీ హీరో సుమన్ ఉద్ఘాటించారు. రాజకీయల్లోకి రావటానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని.. దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సుమన్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా (తిరువూరు) ఆగస్టు18, (ఆంధ్రజ్యోతి): రాజకీయం వేరు.. సినీరంగం వేరని ప్రముఖ సినీ హీరో సుమన్ (Hero Suman) వ్యాఖ్యానించారు. తాను దాదాపు 800 సినిమాల్లో నటించానని గుర్తుచేశారు. స్వయం కృషితోనే సినిమా రంగంలోపైకి వచ్చానని ఉద్ఘాటించారు. తనపై చూపిస్తున్న అభిమానుల ఆదరణ మరువలేనిదని సుమన్ పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) తిరువూరు బైపాస్ రోడ్ 'Y' జంక్షన్ వద్ద బీసీ సంఘాలు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తిరువూరులో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని చెప్పుకొచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, బీసీ, గౌడ సంఘాల ఆధ్వర్యంలో మహానీయులను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తనతో ఆవిష్కరణ గావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను కన్నా తల్లిదండ్రుల గొప్పతనం తర్వాత కులం కూడా ఎంతో గొప్పదని, గౌడ కులంలో పుట్టడం కూడా తన అదృష్టమని ఉద్ఘాటించారు సినీ హీరో సుమన్.
తెలుగు రాష్ట్రాల్లో బీసీ కులాలు పెద్ద ఎత్తున ఉన్నాయని.. వారికి సామాజిక న్యాయం, రాజకీయ, ప్రభుత్వ పరంగా బీసీలకు న్యాయం జరగాలని సుమన్ ఆకాంక్షించారు. బీసీ కులాల్లో పుట్టిన యువత ఉన్నత చదువులు చదివి సామాజింగా, ఆర్థికంగా ఎదగాలని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం ఆ దేవుని దయ అని.. హీరోగా ఎదగటానికి కూడా దైవ సంకల్పమే కారణమని ఉద్ఘాటించారు. రాజకీయాల్లోకి రావటానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని.. దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని నొక్కిచెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తున్నానని, అవి త్వరలో విడుదల కాబోతున్నాయని సినీ హీరో సుమన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News