Social Media Reels: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో రౌడీయిజం.. యువకుల బెదిరింపులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:56 AM
విజయవాడ నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు.
» రీల్స్, రౌడీయిజం.. నగరంలో రెచ్చిపోతున్న కొందరు యువకులు
» పీకలు కోస్తామంటూ బెదిరిస్తూ రీల్స్
» ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ వెర్రివేషాలు
» ఏకంగా గంజాయిని పక్కన పెట్టుకుని ఫొటోలా
» కొత్తపేట పీఎస్ పరిధిలో యువకుల బరితెగింపూ
» పోలీసు కౌన్సెలింగ్ వ్యూస్ కోసమంటూ కవరింగ్
'..మీరంతా లం.. తెలుసురా. మీ వయసుకు గౌరవం ఇస్తున్నా. దాన్ని నిలబెట్టుకోండి. లేకపోతే పీక కోస్తా.' ఇన్‌స్టాలో ఓ యువకుడి పోస్ట్ ఇది,
..ఒకటే కోత, టూటౌన్ పీఎస్‌కు వార్త. నా కొడ.. తెలుసుగా పీకలు కోసి లోపలికి వెళ్లిపోతాం." సోషల్ మీడియాలో ఇద్దరు యువకులు చేసిన రీల్ ఇది.
నగరంలో కొందరు యువకులు రీల్స్ మోజులో రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకరిని హెచ్చరిస్తూ.. బూతులు తిడుతూ.. పీకలు కోస్తామని బెదిరిస్తూ చేస్తున్న రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఏకంగా గంజాయి సేవిస్తున్న ఫొటోలు కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ): నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో (Social Media Reels) తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో (Instagram) పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు. నగరంలో ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. ఎదుటి వారికి, ప్రత్యర్థులను హెచ్చరించేలా ఈ రీల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నగరంలో ఇద్దరు యువకులు చేసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రీల్స్ చేసిన ఇద్దరిలో ఒక యువకుడిపై కులు కేసులు ఉండటం గమనార్హం.
బెదిరింపుల రీల్స్ ఇలా..
నగరంలోని కొత్తపేటకు చెందిన గేదెల యేసేబు ఖాళీగా ఉంటున్నాడు. స్నేహితుడు బన్నీతో కలిసి కొద్దిరోజుల క్రితం ఒక రీల్ చేశాడు. వారిలో ఉన్న నేర స్వభావం ఎలా ఉంటుందో ఈ రీల్ చూసిన వారికి అర్థమవుతుంది. యేసేబుపై ద్విచక్ర వాహన దొంగతనాల కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఖరీదైన బైక్‌పై బన్నీతో కలిసి ఓ ఖాళీ ప్రదేశానికి వెళ్లి ఈ రీల్ చేశాడు. ఈ రీల్లో -యేసేబు.. 'ఒక కోత, టూ టౌన్ పీఎస్‌కు వార్త. నా కొడ..' అని మాట్లాడాడు. పక్కన ఉన్న బన్నీ 'తెలుసుగా పీకలు కోసి లోపలికి వెళ్లిపోతాం' అంటూ మాట్లాడాడు.
ఈ రీల్స్‌ను '420 బెజవాడ బాప్' ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని వారి స్నేహితులకు పంపారు. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కొత్తపేట పోలీసులు యేసేబు, బన్నీలను పిలిపించారు. ఈ వీడియోలపై ప్రశ్నించగా, తాము ఎవరినీ హెచ్చరించలేదని, కేవలం వ్యూస్ కోసం ఈ రీల్ చేసినట్లు వివరించారు. దీనిపై పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇంతకుముందు రెండు, మూడు గ్యాంగ్‌లు ఈవిధంగానే ఇన్‌స్టాలో రీల్స్ ద్వారా బెదిరించారు. వాటిలో ఒక గ్రూపులో ఒకరి హత్య తర్వాత ఇన్‌స్టాలో పోస్టు చేసిన రీల్స్ బయటకు వచ్చాయి.
గంజాయి ఫొటోలు ఎవరివి?
ఈ యువకుల ఇన్‌స్టా ఖాతాలో మరో ఫొటో ఉంది. అందులో ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, దాని పక్కన కాగితాల్లో గంజాయి కనిపిస్తున్నాయి. ఈ ఫొటో ఎవరిదనే విషయం మాత్రం తేలడం లేదు.. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ అధికారులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోపక్క ఈగల్ బృందాలు పనిచేస్తున్నాయి. గంజాయితో రెండుసార్లు చిక్కిన వారిని పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి జైళ్లకు పంపుతున్నారు. అయినా ఈ యువకులిద్దరూ ఎలాంటి జంకు లేకుండా కాగితాల్లో గంజాయి ఉన్న ఫొటోను పోస్టు చేయడం గమనార్హం. పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధికి చుట్టుపక్కల గంజాయి సమాచారం కోసం పక్కా నిఘాను ఏర్పాటు చేశారు. అయినా కొన్ని గ్యాంగ్‌లు గంజాయి ఛాయలను వదులుకోవట్లేదు.
స్టేషన్‌కు పిలిపించాం..
ఇన్‌స్టాలో రీల్స్ పోస్టు చేసిన యువకులిద్దరినీ గుర్తించాం. వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. హద్దులు దాటితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాలను యువత సద్వినియోగం చేసుకోవాలి.
-చినకొండలరావు, ఇన్‌స్పెక్టర్, కొత్తపేట
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News