CM Chandrababu Visits Dundi Ganesh: దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరు... వాళ్ల సంగతి చూస్తారు: చంద్రబాబు
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:38 PM
దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని.. వాళ్ల సంగతి చూస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడ, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): తనకు వినాయక చవితి (Vinayaka Chaviti) అంటే చాలా ఇష్టమని... తాను కూడా ఇలాంటి వినాయకులను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గుర్తు చేశారు. ఈ పండుగ రోజు చిన్నపిల్లలు మంచిగా చదువుకోవాలని పుస్తకాలను వినాయకుడు వద్ద ఉంచుతారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ప్రతి వాడ, పల్లె, గల్లీలో జరిగే పండగ వినాయక చవితి అని ఉద్ఘాటించారు. ఇవాళ(బుధవారం) విజయవాడ సితార సెంటర్‌లో డూండీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఐదు సంవత్సరాలు డూండీ సేవాసమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకోలేకపోయారని.. అలాంటి పాలకులు అప్పుడు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని... వాళ్ల సంగతి చూస్తారని హెచ్చరించారు. డూండీ గణేష్ సేవా సమితి తొమ్మిది కమిటీ మెంబర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలకు మైక్, కరెంట్ పెట్టుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుతారని.. ఈసారి భక్తుల కోసం అలాంటివి లేకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.30 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతున్నా కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో గణేష్ ఉత్సవాలు జరగాలంటే అనేక విఘ్నాలను నాటి పాలకులు కల్పించేవారని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనంలో చాలా ఇబ్బందులు ఉండేవని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనేక విగ్రహాలు ఉన్నా వాటి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, చిన్న అపశృతి కూడా ఉండటానికి వీల్లేదని నాడు ఆదేశించానని గుర్తు చేశారు. డూండీ గణేష్ నిమజ్జనం ఇక్కడే నీటితో చేస్తారని... ఆ మట్టిని పొలంలో వేసుకుంటే నాలుగురెట్ల పంట పెరుగుతుందని వివరించారు. వాతావరణం, పరిసరాలు కలుషితం అయ్యాయని... అందుకే ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని చెప్పుకొచ్చారు. బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే భారీగా గోదావరి, కృష్ణా నదిలో నీరు సముద్రంలో కలుస్తున్నాయని వెల్లడించారు. ఎన్నికల ముందు చెప్పిన సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని ఉద్ఘాటించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని నొక్కి చెప్పారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం
భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్
For AP News And Telugu News