Pawan Kalyan React Moolapet Incident: విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:56 PM
వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో విద్యుతాఘాతంతో ఏడిద చరణ్ అనే యువకుడు మృతిచెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా విద్యుత్ ప్రసారమై కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఏడిద చరణ్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు పవన్ కల్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు యువకులు గాయపడ్డారని అధికారులు చెప్పారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు పవన్. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు. క్రీడా ప్రాంగణాల్లో, పని ప్రదేశాల్లో పోల్స్ లాంటివి నిలిపేటప్పుడు, ఎత్తైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టే సమయంలో విద్యుత్ షాక్‌కు ఆస్కారం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ దశలోనూ అశ్రద్ధ వహించొద్దని, ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..
For AP News And Telugu News