Share News

Kotamreddy Sridhar Reddy: నన్ను కెలకొద్దు.. వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి మాస్ వార్నింగ్..

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:05 PM

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ బెయిల్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని.. అనవసరంగా నన్ను కెలకొద్దంటూ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Kotamreddy Sridhar Reddy: నన్ను కెలకొద్దు.. వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి మాస్ వార్నింగ్..
Kotamreddy Sridhar Reddy Attacks YSRCP Leaders

నెల్లూరు: వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ బెయిల్ విషయంపైనా వివరణ ఇచ్చారు. అతడికి పెరోల్ ఇవ్వాల్సిందిగా తానూ, ఎమ్మెల్యే పాశం సునీల్ సిఫార్సు లేఖలు ఇచ్చినప్పటికీ వాటిని హోంశాఖ పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. శ్రీకాంత్‌కి వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా గతంలో సిఫార్సు లేఖలు ఇచ్చారు. వారిని నేను తప్పుబట్టడం లేదని.. ప్రజాప్రతినిధుల వద్దకి రకరకాల బాధల్లో ప్రజలు వస్తుంటారని అన్నారు. కానీ, జీవితంలో ఇకగా నేను ఎవరికీ పెరోల్‌కి సిఫార్సు లేఖ ఇవ్వనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యో కోటంరెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చిన 15 రోజులకు రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ బెయిల్ మంజూరు కావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ఎలా జరిగిందనే దానిపై స్వయానా హోంశాఖ మంత్రి అనిత విచారణకి ఆదేశించారు.


నేనేమీ దందాలు చేయడం లేదు..

ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ,'నా వ్యక్తిగత విషయాలపై వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి చాలా మాట్లాడారు. పాలడబ్బా కోసం స్నేహితుడి వద్ద రూ.100లు తీసుకున్నానని ఆరోపించారు. పాల డబ్బా కోసం రూ.100లు తీసుకున్నది నిజం. మాదేమీ మైసూర్ మహారాజా కుటుంబం కాదు. హైదరాబాదులో రూ.10లు ఖర్చుబెట్టి మడత మంచం లాడ్జీలో నెలల పర్యంతం ఉన్నాం. ఎప్పటికీ అలాగే ఉండిపోవాలా? 2014లో నేను ఎమ్మెల్యే అయితే, 2000 సంవత్సరంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిన్నపాటి కాంట్రాక్టులు ఉండేవి. ఇప్పుడు ఆర్ధికంగా స్థితిమంతులం కాబట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పెద్ద కాంట్రాక్టులు చేస్తున్నాం. వ్యాపారాలు చేయడం తప్పేమీ కాదు. రాజకీయ, ఆర్ధిక దందాలు చేస్తే తప్పు. అవే చేసి ఉంటే, నాపై మీ జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు.' అని ప్రశ్నించారు.


చుక్కలు చూపించేవాడిని..

నా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించారు కాబట్టి 2004 - 2014 మధ్య మీరు చేసిన హత్యలు, ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల గురించి మాట్లాడుదామని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆనం విజయకుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.18 నెలలు జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. మేం ఏ వైసీపీ నేతనైనా, కార్యకర్తపైన అయినా దాడులు చేశామా? వేధించామా? వెంటాడామా? అక్రమ కేసులు పెట్టామా? చెప్పాలని అన్నారు. వైసీపీ హయాంలో ఆ 18 నెలలు మీరు చేసిన పాపాలు, దుర్మార్గాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. నన్ను, నా కుటుంబ సభ్యులని, నా తమ్ముడుని వేధించినట్టే వేధించాలనే అనుకుంటే.. ఇప్పుడు కచ్చితంగా చుక్కలు చూపించేవాడిని.


కెలకొద్దు.. ఇంతకు పదింతలు బదులిస్తాం..

కానీ, మా అధినేత చంద్రబాబు గీత దాటితే తాటతీస్తారు. చట్టవిరుద్దమైన ప్రతీకార చర్యలకి పాల్పడొద్దని చంద్రబాబు, లోకేశ్ క్లియర్ గా చెప్పారు‌. కాబట్టే మేం చేతులు కట్టేసుకున్నాం. యధా రాజా... యధా ప్రజ... నాకే కాదు, రాష్ట్రంలో అందరికీ అవే ఆదేశాలిచ్చారు. వైసీపీ కార్యకర్తల్లారా... పండుగ చేసుకోండి. నన్ను అనవసరంగా కెలకొద్దు. రండి... ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం. ప్రజల కోసం కలిసి పనిచేద్దాం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి పిలుపునిచ్చారు. కానీ, చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు కొనసాగిస్తే మాత్రం అందుకు పదింతలు బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు.


ఇవీ చదవండి..

స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

సైబర్ నేరగాళ్లకు చిక్కిన టీడీపీ మంత్రి అల్లుడు..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2025 | 12:23 PM