Human Rights Forum: స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:56 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది.
మానవ హక్కుల వేదిక డిమాండ్
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది. ఇటీవల ఒకేసారి కీలకమైన 34 విభాగాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్కు ఉత్పత్తి అతి ప్రమాదకరమైన పరిశ్రమ అని, అన్నిరకాలుగా శిక్షణ పొందిన వారే దానిని నడపాలని, ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఫార్మా సిటీల్లో ప్రమాదాలు జరుగుతున్నట్టు ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతాయని హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధులు కేవీ జగన్నాథరావు, వీఎస్ కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా కాంట్రాక్టు వర్కర్లను వేల సంఖ్యలో తొలగించారని, తక్షణమే వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైందని, దానిని ప్రైవేటు సంస్థల కోసం నిర్వీర్యం చేయడం తగదని మానవ హక్కుల వేదిక పేర్కొంది.