Dharamasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్ట్.. ముసుగు మనిషి అరెస్ట్..!
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:03 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు ఊహించని విధంగా కీలక మలుపు తిరిగింది. వందలకొద్దీ మృతదేహాలను పలుచోట్ల ఖననం చేశానంటూ ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు 'భీమా'ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
కర్ణాటక: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక మృతదేహాలు ఖననం కేసు కీలక మలుపు తిరిగింది. వందలాది మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేశానని ఫిర్యాదు చేసిన మాస్క్ మ్యాన్ భీమా అసలు రంగు బయటపడింది. పారిశుద్ధ్య కార్మికుడు ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలు బూటకమేనని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించిన మాస్క్ మ్యాన్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ధర్మస్థల ఆలయ పరిసరాల్లో సుమారు 100కు పైగా మృతదేహాలను ఖననం చేశానంటూ భీమా 15 రోజులుగా ఆడుతున్న నాటకానికి సిట్ బృందం తెరదించింది. మాయమాటలతో వ్యవస్థను నమ్మించి విచారణలో పదే పదే తన వాదనలు మార్చిన భీమా చివరకి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడు. దీంతో ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్ బృందం పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అదుపులోకి తీసుకుంది. ఇంత డ్రామా ఆడటానికి కారణాలేంటని రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. విచారణ అనంతరం భీమాను కోర్టులో హాజరు పరచనున్నారు.
ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయిన బెంగళూరుకు చెందిన సుజాత భట్‌పైనా విచారణ కొనసాగుతోంది. ఆమె, తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థలలో అదృశ్యమైందని ఫిర్యాదు చేసింది. కానీ, తాజాగా ఆమె ఆ ఆరోపణలను తిరస్కరించింది. దీంతో సుజాతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ధర్మస్థల శైవ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం సంచలన ఆరోపణలు చేశాడు. 1995 నుండి 2014 మధ్య లైంగిక వేధింపులకు గురై హత్య చేయబడ్డ 100కు పైగా మహిళలు, పిల్లల మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని.. 2014లో తమ కుటుంబంలోని ఓ యువతిని లైంగికంగా వేధించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. పశ్చాతాపం వెంటాడుతుండటంతోనే ఈ ఫిర్యాదు చేసినట్లు భీమా వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్ బృందాన్ని రంగంలోకి దింపింది. భీమా చెప్పిన ప్రకారం పలు చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు. కేవలం రెండు ప్రదేశాల్లోనే కొన్ని ఎముకలు కనిపించాయి.
స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో సిట్ అధికారులకు ఫిర్యాదుదారుడైన భీమా ఆరోపణలపై అనుమానం రేకెత్తింది. దీంతో లోతుగా దర్యాప్తు నిర్వహించగా ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. విచారణలో భీమా కూడా మాట మార్చాడు. వేరెవరో ఒక పుర్రె ఇచ్చి పోలీసులకు ఇమ్మన్నారని.. కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారని.. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉన్నానని అతడు పేర్కొనడంతో సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్‌ప్లాజాలలో టోల్ ఫ్రీ..
Read Latest Telangana News and National News