Share News

Chennai News: విజయ్‌పై విపక్షాల విసుర్లు

ABN , Publish Date - Aug 23 , 2025 | 10:30 AM

మదురై మహానాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలను విమర్శించడాన్ని ఖండిస్తూ ఆ పార్టీల నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలకు సేవలందిస్తున్న స్టాలిన్‌ను విజయ్‌ విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు.

Chennai News: విజయ్‌పై విపక్షాల విసుర్లు

- అభిమానుల మెప్పు కోసమే ఆ మాటలు: మంత్రి నెహ్రూ

- తనను తాను అవతారమూర్తిగా ఆత్మవంచన

- అన్నాడీఎంకే నేత ఉదయకుమార్‌

చెన్నై: మదురై మహానాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌(Vijay) డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలను విమర్శించడాన్ని ఖండిస్తూ ఆ పార్టీల నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలకు సేవలందిస్తున్న స్టాలిన్‌ను విజయ్‌ విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు విజయ్‌కి మొదటివని,


అందువల్ల ఓట్ల కోసం వ్యూహ రచన చేయాలనే కానీ, ప్రజా సేవలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న నేతలను అభిమానుల మెప్పు కోసం విమర్శించడం సరి కాదన్నారు. విజయ్‌ మాటలను ప్రజల లెక్కచేయరన్నారు. మరో మంత్రి మూర్తి మాట్లాడుతూ... టీవీకే మహానాడుకు ఆటంకం కలిగించేలా ప్రభుత్వ కుట్ర పన్నిందన్న విజయ్‌ ఆరోపణలు అవాస్తవాలన్నారు. ఆ పార్టీ మొదటి మహానాడు విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలో గత ఏడాది నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నివిధాల సహకరించిన విషయాన్ని విజయ్‌ మర్చిపోవడం విడ్డూరంగా ఉందన్నారు.


ఆత్మవంచన చేసుకుంటున్న విజయ్‌: అన్నాడీఎంకే

సినీ హీరో విజయ్‌ తనను తాను అవతారమూర్తిగా భ్రమిస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారని అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, డి.జయకుమార్‌ విమర్శించారు. రాజకీయ, సినీరంగాల్లో ఎంజీఆర్‌, జయలలిత ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, వారిలా కావాలనుకోడం విజయ్‌ వల్ల సాధ్యం కాదన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ మాట్లాడుతూ...


టీవీకే మదురై మహానాడులో పాల్గొన్న వారంతా విజయ్‌ను ఒక రాజకీయ నేతగా చూడలేదని, ఆయన నటుడు కావడంతో ప్రత్యక్షంగా చూడాలని వెళ్లారని చమత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయని, రాజకీయాల్లో అనుభవం లేని విజయ్‌కు ప్రధానిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కచ్ఛాదీవి గురించి మాట్లాడుతున్న విజయ్‌.. అది ఎవరి హయాంలో శ్రీలంకకు ధారాదత్తం చేశారో మహానాడులో ప్రస్తావించలేదన్నారు. దీనిని బట్టి ఆయనకు రాజకీయాల్లో అనుభవం శూన్యమని స్పష్టమవుతుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

రాజధానిలో మౌలిక వసతులేవి..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 10:30 AM