Kishan Reddy: రాజధానిలో మౌలిక వసతులేవి?
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:31 AM
రాష్ట్ర రాజధానిలో కనీస రోడ్ల సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పార్కులను రక్షించడం వంటి పనులు చేపట్టకపోవడంతో ప్రజల జీవితం నరకప్రాయంగా మారిందని అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
రోడ్లు, డ్రైనేజీ పనులు చేయట్లేదు
ఏడాదికాలంగా వీధిలైట్లు వెలగట్లే
నరకప్రాయంలా ప్రజల జీవితం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో కనీస రోడ్ల సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పార్కులను రక్షించడం వంటి పనులు చేపట్టకపోవడంతో ప్రజల జీవితం నరకప్రాయంగా మారిందని అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలపై తాము ప్రశ్నిస్తే రాష్ట్ర మంత్రులు తిడుతూ తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారని అన్నారు. చేయాల్సిన పనులు చేసి తర్వాత తమను ఒకటికాదు రెండు తిట్టినా పడతామని కిషన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాదులో ఏడాదికిపైగా వీధిలైట్లు లేని దౌర్భాగ్యం నెలకొందని, రోడ్లు అధ్వానంగా మారినా స్పందించేవారు కరువయ్యారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. దీనిపై ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు జీహెచ్‌ఎంసీని అనాథ చేశాయని ఆయన విమర్శించారు. మౌలిక సౌకర్యాలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ భూముల వ్యాపారం మాత్రం బాగా చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ వ్యాపారం రిటైల్‌గా జరగ్గా, కాంగ్రెస్ హయాంలో హోల్‌సేల్‌గా సాగుతోందని ఆరోపించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాటానికి మద్దతు
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాటానికి తాము మద్దతిస్తున్నామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన పీఆర్సీకి అతీగతీ లేకుండాపోయిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు బీఆర్‌ఎస్ హయాంలో మూడు డీఏలు చెల్లించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో మూడు డీఏలు కలి పెండింగ్‌లో ఉన్నవి ఆరు అయ్యాయని చెప్పారు. అందులో ఒక డీఏను 28 వాయిదాల్లో చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇలా అయితేపూర్తి కాంగ్రెస్ హయాంలోపూర్తి చేయడం కష్టమేనని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News