Raghunandan Rao: అందుకే యూరియా ఆలస్యమైంది
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:00 PM
కొంత మంది కావాలని యూరియా కొరత పేరిట చెప్పులను లైన్‌లో పెట్టించి మరి రాజకీయం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లో తెలంగాణకు తీసుకు వస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సిద్దిపేట, ఆగస్టు 22: ఆపరేషన్ సిందూర్ వల్ల యూరియా రావడం ఆలస్యమైందని బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేటలోని విఏఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కొంత మంది కావాలని యూరియా కొరత పేరిట చెప్పులను లైన్‌లో పెట్టించి మరి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లో తెలంగాణకు తీసుకు వస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు యూరియా ఇచ్చేది బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కాదని కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు గుర్తు చేశారు.
రైతులందరికి సరిపడే యూరియాను వారం రోజుల్లో అందిస్తామన్నారు. కొంత మంది యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశించారు. రాజకీయ నాయకుల తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని.. అలాగే ఆందోళన చెంద వద్దంటూ రైతులకు సూచించారు. ఇక ప్లెక్సీల కోసం దిగజారి రాజకీయం తాము చేయమని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వారికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ సైతం రాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు.
రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారంటూ ప్రధాని మోదీపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం సమ దృష్టితో.. సమన్యాయం చేస్తుందని తెలిపారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలు, అంగన్వాడీ కేంద్రానికి రూ. 10 లక్షలు నిధులను కేంద్రం విడుదల చేస్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజక వర్గాల్లో 26 అంగన్వాడీ కేంద్రాలకు రూ. 2. 8 కోట్లు కేటాయించారని వివరించారు.
కాంగ్రెస్ నాయకులు పనుల జాతర పేరిట కొబ్బరి కాయలు కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను వారు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. మెదక్ జిల్లాలోని 27 అంగన్వాడీ కేంద్రాలకు రూ. 2. 10 కోటలు నిధులు మంజూరు చేశామని వివరించారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 56 అంగన్వాడీ కేంద్రాలకు రూ. 4. 6 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసిందని గుర్తు చేశారు. పనుల జాతర పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే పనుల్లో 75 శాతం నిధులు కేంద్రం ఇచ్చిందని.. మిగిలిన 25 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
Read Latest Telangana News and National News