Share News

Supreme Court: గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులని విధుల్లోకి తీసుకోవాలి.. సుప్రీం ఆదేశం

ABN , Publish Date - Oct 28 , 2025 | 09:41 PM

1200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియమించిన మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లని విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court:  గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులని విధుల్లోకి తీసుకోవాలి.. సుప్రీం ఆదేశం
Supreme Court

ఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): 1200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు (పురుష) (Multipurpose Health Assistants)కు సుప్రీంకోర్టు (Supreme Court) శుభవార్త తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియమించిన మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లని విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ(మంగళవారం) మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య కారణాలతో తిరిగి నియమించిన 1,200 మంది నియామకాలపై స్పష్టత ఇచ్చింది సుప్రీంకోర్టు. 2013లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అయితే, హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు.


2002 అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అర్హత ప్రమాణాలు ఖరారు చేసి... నోటిఫికేషన్‌ జారీ చేయగా... దాన్ని పలువురు అభ్యర్థులు హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పుడు సవాల్ చేశారు. పదోతరగతితో పాటు.. డిప్లొమో ఉన్న వారు అర్హులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇంటర్మీడియట్‌ అర్హతతో అపాయింట్‌‌ అయిన సుమారు 1200 మంది సీనియారిటీ జాబితా ఆధారంగా కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం టెర్మినేట్‌ చేసింది. వీరికి న్యాయం చేయడం కోసం మానవతా ధృక్పథంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో జీఓ నెంబర్ 1207ని తీసుకువచ్చింది. 1200 మంది కారుణ్య నియామకాలని నిబంధనల ద్వారా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


2013లో తీసుకువచ్చిన జీఓను పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ అనంతరం గత ఏడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపడుతూ జీవోని కొట్టివేసింది. ఈ విషయంపై అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. మానవతా దృక్పథంతో తీసుకువచ్చిన జీవోని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. 1200 మందిలో ఏపీలో ఉన్న వారందరినీ విధుల్లోకి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు విచారణ ముగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈరోజు తుది ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన నియమకాల ప్రక్రియ కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్తర్వులు అమలు చేయాలని జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 10:06 PM