Supreme Court On Savinder Reddy Case: సవీందర్‌రెడ్డిపై సీబీఐ చర్యలు తీసుకోవద్దు.. సుప్రీం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:53 PM
సోషల్ మీడియా యాక్టివిస్టు సవీందర్‌రెడ్డిని అరెస్టు చేసిన వ్యవహారంలో సీబీఐ తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై దాఖలైన హెబియస్ కార్పస్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ఢిల్లీ, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా యాక్టివిస్టు సవీందర్‌రెడ్డి (Savinder Reddy)ని అరెస్టు చేసిన వ్యవహారంలో.. సీబీఐ (CBI) తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై దాఖలైన హెబీయస్ కార్పస్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో వ్యక్తిగత హోదాలో సవాలు చేశారు దర్యాప్తు అధికారి గన్నవరపు శ్రీనివాసరావు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్రశర్మ విచారణ చేపట్టారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు అక్రమంగా అరెస్టు చేశారని హైకోర్టులో సవీందర్‌రెడ్డి భార్య లక్ష్మీప్రసన్న పిటిషన్ దాఖలు చేశారు. సవీందర్‌రెడ్డిని గంజాయి కేసులో అరెస్టు చేశారని సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వ దర్యాప్తు అధికారి తరపు న్యాయవాదులు నివేదించారు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అరెస్టు చేసి... తర్వాత గంజాయి కేసులో ఇరికించారని సవీందర్‌రెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అదే విషయాన్ని హైకోర్టు పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణకు ఆదేశించిందని న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారని, ఇది నిబంధనలకు విరుద్దమని సవీందర్‌రెడ్డి న్యాయవాది వివరించారు.
గంజాయి కేసులో అరెస్టు చేస్తే... దానికి రాజకీయ కారణాలు అన్వయిస్తున్నారని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలను జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అనంతరం ఈ కేసుపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతోపాటు... సీబీఐ తదుపరి కార్యచరణ చేపట్టవద్దని ఆదేశించింది ధర్మాసనం. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీబీఐ, రిలయన్స్ జియో సంస్థతో పాటు... మొత్తం 11 మందిని ఈ కేసులో దర్యాప్తు అధికారి చేర్చారు. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది ధర్మాసనం. ఈ పిటిషన్‌పై త్వరలోనే తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు... భూమనకు మంత్రి మండిపల్లి వార్నింగ్
ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే
Read Latest AP News And Telugu News