Minister Janardhan Reddy on Seaplane: మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసిన సీప్లేన్ సర్వీసుల ప్రతినిధులు
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:25 PM
రాబోయే రోజుల్లో ఏవియేషన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని మంత్రి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీలో ఏవియేషన్ రంగంలో ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంపై మంత్రి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister Janardhan Reddy)తో ఇవాళ(గురువారం) మెహెయిర్ (MEHAIR) సీప్లేన్ (Seaplane) సంస్థ ప్రతినిధులు ఏపీ సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో సీప్లేన్ సర్వీసులు అందించడానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
ఏపీలో దాదాపు 32 ప్రాంతాల్లో సీ ప్లేన్ సర్వీసులు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏవియేషన్ హబ్‌గా (Aviation Hub) ఆంధ్రప్రదేశ్ మారబోతుందని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలకు అన్ని విధాలుగా ప్రభుత్వ సహాకారం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP M Nara Chandrababu Naidu) నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
సుస్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వంతో... ఏపీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసుల కల్పన ద్వారా టూరిజం రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సీప్లేన్ సంస్థ రాకతో ఏపీలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అనుసంధానం పెరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్ ఆగ్రహం
చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News