AP Cabinet: ఏపీ కేబినెట్‌లో 24 అంశాలపై చర్చ.. జిల్లాల పునర్వవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:50 PM
గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్‌లో అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన (సోమవారం) మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) మీడియాకు వెల్లడించారు. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.
వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్‌లో అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని, రూ.41 కోట్ల రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. అలాగే స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
17 జిల్లాల్లో మార్పులు..
జిల్లాల పునర్వవస్థీకరణపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని, మిగిలిన 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. పోలవరం జిల్లాను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేసినట్లు తెలిపారు. గూడురులోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోకి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. రంపచోడవరం ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు, ఒకే పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాలు ఉన్నా కూడా ఈ జిల్లా ఏర్పాటు చేశామని వివరించారు.
మండలాలు, జిల్లాల మార్పులిలా..
సామర్లకోట మండలాన్ని పెద్దాపురం నియోజకవర్గానికి మార్చినట్లు తెలిపారు. అలాగే పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా పేరు మార్చినట్లు వెల్లడించారు. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్చినట్లు వివరించారు. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి చేర్చామని తెలిపారు. రాజంపేటను ఎప్పటి నుంచో జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రజల అభిప్రాయం మేరకు కడప జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
మదనపల్లిని జిల్లాగా చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదని, అందువల్ల రాయచోటి నుంచి మదనపల్లికి హెడ్ క్వార్టర్ మార్చి అన్నమయ్య జిల్లాగా మార్పు చేశామని వివరించారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.అలాగే ఆదోనిలో పరిపాలనా సౌలభ్యం కోసం మండలాల సంఖ్యను పెంచి ఆదోని–1, ఆదోని–2గా విభజించినట్లు ప్రకటించారు. ఈ జిల్లాల, మండలాల మార్పులన్నీ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..
21 అంశాల అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం
Read Latest AP News And Telugu News