Share News

CM Chandrababu: రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు.

CM Chandrababu: రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..
CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ (సోమవారం) నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పరిపాలనా మార్పులు, రెవెన్యూ, పోలీస్ వ్యవస్థల సరిపోలిక, అలాగే కొన్ని ప్రాంతాల అభివృద్ధి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా జిల్లాల నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం కీలకంగా మారింది.


రాయచోటి అంశంపై సుదీర్ఘ చర్చ

ఈ సమావేశంలో రాయచోటి మార్పు అంశంపై ప్రత్యేకంగా సుదీర్ఘ చర్చ జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా రాజంపేట ప్రాంతానికి చెందిన ప్రజలు తాము రాయచోటితో కలవబోమని స్పష్టంగా చెబుతున్నారని, ఈ పరిస్థితిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే జిల్లా స్థాయికి తీసుకురావడం సాధ్యమా అనే ప్రశ్నను సీఎం లేవనెత్తారు. రాష్ట్ర పరిపాలనలో సమతుల్యత ఉండాలంటే జిల్లాల నిర్మాణం విస్తృతంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయి అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాయచోటి అభివృద్ధి బాధ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రజల ఆందోళనను తగ్గించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.


నెల్లూరు జిల్లాలో మార్పులపై చర్చ

నెల్లూరు జిల్లాకు సంబంధించిన పరిపాలనా మార్పులపై మంత్రి నారాయణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గం చాలా సేపు చర్చించింది. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్లు ఒక విధంగా ఉండగా, పోలీస్ సబ్ డివిజన్లు మరో విధంగా ఉండటంతో పరిపాలనలో సమస్యలు వస్తున్నాయని మంత్రి నారాయణ వివరించారు. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అన్ని శాఖల పరిపాలనా నిర్మాణాలు ఒకే విధంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.


ఆదోని మండలాల విభజనపై చర్చ

కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతానికి సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఆదోనిని రెండు మండలాలుగా విభజించిన విషయంపై చర్చ జరిగింది. ఆదోని ఒకటి, ఆదోని రెండు అని ఎందుకు వేర్వేరు పేర్లు పెట్టవచ్చుకదా అని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. ఈ విషయంపై అధికారులు వివరణ ఇచ్చారు. ఆ ప్రాంతంలో చిన్న పల్లెలు ఎక్కువగా ఉండటంతో పరిపాలనా సౌలభ్యం కోసం అలా విభజన చేశామని వెల్లడించారు. ప్రజలకు సేవలు త్వరగా అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.


ఏపీ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం మంచి పనితీరును చూపించిందని సీఎం పేర్కొన్నారు. 2025వ సంవత్సరం రాష్ట్రానికి చాలా అనుకూలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు 21 సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వాటి ద్వారా ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లామని సీఎం చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, ప్రజలకు సేవల అందజేయడంలో తమ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి...

అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి

21 అంశాల అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 03:22 PM