AP New Bar Policy: గుడ్ న్యూస్.. ఏపీలో నూతన బార్ పాలసీ.. కొత్త మార్గదర్శకాలివే..
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీ నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 840 బార్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని.. పది శాతం కల్లు గీత కులస్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కొత్త వారూ ఈ బిజినెస్‌లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని వివరించారు.
అమరావతి, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) కొత్త బార్ పాలసీ (New Bar Policy) నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ (Nishant Kumar) తెలిపారు. 840 బార్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని.. పది శాతం కల్లు గీత కులస్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కొత్త వారూ ఈ వ్యాపారంలోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని వివరించారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలని.. ఈసారి ఈ నిబంధన సడలించామని చెప్పుకొచ్చారు. 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని వెల్లడించారు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్.
50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజు ఉంటుందని చెప్పారు. అలాగే 5 లక్షలపైన జనాభా ఉంటే లైసెన్స్ ఫీజ్ రూ.75 లక్షలు ఉంటుందని ప్రకటించారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఈ ఫీజులు పెంచుతామని తెలిపారు. గతంలో ఒకేసారి ఆగస్టు నెలలోపు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేదని గుర్తుచేశారు. ఈసారి ఆరుసార్లుగా చెల్లింపులు జరపవచ్చని సూచించారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని... ఈసారి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని కేటగిరీల్లో దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించామని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పుకొచ్చారు.
గతంలో కేటగిరీలను బట్టి రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఉండేదని గుర్తుచేశారు. ఒక్కో బార్‌కి 27 దరఖాస్తులు గతంలోనే వచ్చాయని.. కొన్ని బార్‌లకు 131 దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల మద్యం సిండికేట్లు కొత్త వారిని రాకుండా చేసే అవకాశం ఉందని... వాటిని ఆపేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. లైసెన్స్ ఫీజు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. ఇవాళ(సోమవారం) నుంచి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 28వ తేదీన కలెక్టర్ లాటరీ తీసి ట్రాన్స్‌పరెంట్‌గా బార్లు కేటాయిస్తారని.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తోందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News