Heavy Rains Alert for AP: ఏపీ తీరంలో అల్పపీడనం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:47 PM
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అమరావతి, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి): ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రేపు(గురువారం) ఏపీలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రేపు(గురువారం) అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ(బుధవారం)సాయంత్రం 5 గంటల వరకు మన్యం జిల్లా సీతంపేటలో 77 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5 మిల్లీమీటర్లు, భీమవరంలో 67.5 మిల్లీమీటర్లు, విజయవాడ పశ్చిమలో 62.5 మిల్లీమీటర్లు, విజయవాడ సెంట్రల్‌లో 62 మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఎగువ రాష్ట్రాల్లో, ఏపీలో కురుస్తున్న భారీవర్షాలతో వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం, స్నానాలు చేయడం లాంటివి చేయొద్దని మార్గనిర్దేశం చేశారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వినాయక నిమజ్జనాల్లో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..
For AP News And Telugu News