CM Chandrababu Instructions to Officials: రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:08 PM
రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అమరావతి,సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులు పెద్దమొత్తంలో పరిష్కారం అవుతాయని తెలిపారు పోలీసు, రెవెన్యూ విభాగానికి వచ్చిన ఫిర్యాదులో 70 శాతం మేర ఉన్నాయని గుర్తుచేశారు. ఆర్ఓఆర్‌కు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో ఏపీలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం ప్రతీ ఏడాది కలుగుతుందని పేర్కొన్నారు. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్లను జారీ చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. గ్రామస్థాయి వరకూ ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందన్న అంశాలను ప్రజలకు తెలిసేలా ఓ ప్రకటన జారీ చేస్తామని వివరించారు. జీవిత భీమా, ఆరోగ్య భీమాపై ఇప్పుడు జీఎస్టీ లేదని స్పష్టం చేశారు. యూనివర్సల్ హెల్త్ కార్డుపై ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో అంచనా వేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన..
జీఎస్టీ పన్నుల తగ్గింపు (GST Tax Reduction) ప్రయోజనాలపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబరు 22వ తేదీ వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. జిల్లాల నుంచి జీఎస్టీ, పన్ను ఆదాయాలు ఎలా ఉన్నాయన్న విషయంపై కూడా పర్యవేక్షణ చేయాలని సూచించారు. మైనింగ్ ఆదాయంలో ఏ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయో అంచనా వేస్తామని చెప్పుకొచ్చారు. జిల్లాల వారీగా మైనింగ్ ఆదాయం పెరగాలని మార్గనిర్దేశం చేశారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజల్లో సంతృప్తి స్థాయి రావాలని పేర్కొన్నారు. రూ.1000 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం కోల్పోయి ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తోందని వెల్లడించారు. ఇలాంటి అంశాల్లో ప్రజలు సంతృప్తి చెందేలా అధికారుల పనితీరు ఉండాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
నవంబర్ నుంచి ఆర్టీజీ కేంద్రాలు..
ప్రభుత్వ సేవలకు రేటింగ్స్ ఇస్తామని తెలిపారు. కలెక్టర్ల నుంచి సెక్రటరీలు రిపోర్టులు కోరవద్దని ఆదేశించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆర్టీజీఎస్ నుంచి తీసుకోవాలని సూచించారు. యువ ఐఏఎస్‌ల సేవలను వాడుకుంటామని చెప్పుకొచ్చారు. టెక్నాలజీ వినియోగంపై మంత్రులు, అధికారులు కలెక్టర్లకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీజీ జిల్లా కేంద్రాలు నవంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని వివరించారు. అలాగే, క్వాంటం భవనాల డిజైన్లపై కలెక్టర్ల అభిప్రాయం కోరారు సీఎం చంద్రబాబు.
ఎర్రచందనంపై కీలక ఆదేశాలు..
ఎర్రచందనంపై (Red Sandal wood) కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని అన్నారు. దాని విలువ లక్షల కోట్లు అని భావించామని... అయితే మీరు దాన్ని నార్మలైజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఎర్రచందనంపై ఇప్పటికైనా అధికారులు కచ్చితమైన ప్లానింగ్ చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని సూచించారు. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఎర్రచందనం యూనిక్ అని.. కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుందని.. అదే సమయంలో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
శాసన మండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు షాక్
మితిమీరిన కోపం వల్ల ఇవన్నీ కోల్పోవలసి ఉంటుంది.!
Read Latest Andhra Pradesh News and National News