Good News For Farmers: ఏపీ రైతులకు పండుగలాంటి వార్త
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:46 PM
ఏపీ రైతులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పండుగ లాంటి వార్త తెలిపారు. ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పండుగ లాంటి వార్త తెలిపారు. ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో (Central Govt) తాను మాట్లాడానని పేర్కొన్నారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా ఏపీకి 10,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఒడిశా ధమ్రా పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఏపీలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యూరియాను యుద్ధప్రాతిపదికన పంపాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అదేవిధంగా గంగవరం పోర్ట్‌కి సెప్టెంబర్ 6వ తేదీన 15,000 మెట్రిక్ టన్నుల యూరియా, సెప్టెంబర్ రెండో వారంలో కాకినాడ పోర్ట్‌కి 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కేంద్రం హామీ ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఖరీఫ్ సీజన్‌కి యూరియా పుష్కలంగా లభిస్తోందని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఎరువుల కొరత ఉండదు..
మరోవైపు... రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొరత ఉండదని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని, ఇప్పటివరకూ 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని వివరించారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎరువుల కొరత రాకుండా 1.10లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేశామని వెల్లడించారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ఏపీ ప్రభుత్వం (AP Govt) ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఇప్పటివరకూ 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, 1.30 లక్షల మెట్రిక్ టన్నులు చేరాయని, 0.47 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయని వివరించారు. ఆగస్టులో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు.
మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని తెలిపారు. రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు IFMS (Integrated Fertilizer Management System) ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి ప్రత్యేక పంటలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
యూరియా కొరత.. అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్
మరోవైపు.. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ మంత్రి భరత్, మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, గుమ్మనూరు జయరామ్, అమిలీనేని సురేంద్ర బాబు, పరిటాల సునీత, తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో యూరియా కొరతపై ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రభుత్వం అనంతపురం జిల్లాకు 5,000 టన్నులు ఎక్కువగా మంజూరు చేసిందని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ప్రతిపాదనలను ఎందుకు పంపించారని ఫైర్ అయ్యారు. సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు యూరియా కొరత వస్తోందని నిలదీశారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూరియా పక్కదారి పట్టిందనే ఆరోపణల్లో వాస్తవం ఎంత అని ప్రశ్నించారు. సొసైటీల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నారా లోకేష్.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు : పల్లా శ్రీనివాసరావు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
For More AP News And Telugu News