Nagababu: జగన్ హయాంలో ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు పెట్టారు: నాగబాబు
ABN , Publish Date - Dec 28 , 2025 | 09:47 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అగ్రనేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లుపెట్టారని ఆరోపణలు చేశారు.
అమరావతి, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) జనసేన అగ్రనేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ( Konidela Nagababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టారని ఆరోపణలు చేశారు. ఈ ఆనవాయితీని తోసిపుచ్చి గోదావరి జిల్లాలకు శుద్ధి చేసిన తాగునీటినీ అందించే నీటి ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని తెలిపారు. వారి త్యాగాలను భవిష్యత్ తరాలు కూడా చెప్పుకునేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేశారని పేర్కొన్నారు.
ఇవాళ(ఆదివారం) పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జనసేనలో పలువురు ఆర్యవైశ్యులు చేరారు. వారికి జనసేన కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా నాగబాబు ఆహ్వానించారు. కొత్తగా జనసేనలో చేరుతున్న వారితో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామని హరిప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్యవైశ్యులు అనగానే ప్రథమంగా గుర్తుకొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములని స్మరించుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుపెట్టాలనే సూచనను సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌వి మహోన్నత ఆశయాలు: ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్
ప్రజాసేవే పరమావధిగా బతికే అతికొద్ది మంది నాయకుల్లో పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. మహోన్నత ఆశయాలు కలిగిన పవన్ కల్యాణ్ జనసేనని స్థాపించి 14 ఏళ్లు అవుతోందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కోవడం తాను స్వయంగా చూశానని గుర్తుచేశారు పిడుగు హరిప్రసాద్.
కూటమిని ఏర్పాటు చేసి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని అన్నారు. సప్తాశ్వాలు, సప్తరుషులు, సప్తగిరులకు ఎంత విశిష్టత ఉందో జనసేన మూల సిద్ధాంతాలకు అంతటి విశిష్టత ఉందని చెప్పుకొచ్చారు. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. జనసేనలో కొత్తగా చేరిన వారు ఆ మూల సూత్రాలను అర్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పిడుగు హరిప్రసాద్ సూచించారు.
విజయనగరంలో జనసేనలో చేరికలు
మరోవైపు.. విజయనగరం జిల్లాలో జనసేనలో పలువురు భారీగా చేరారు. వైసీపీ మాజీ నేతలు నడిపేన శ్రీనివాసరావు, శశి భార్గవి అనుచరులతో కలిసి జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన కండువాలతో పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి...
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎందుకంటే..
ఏపీ అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏఐ ఆధారిత ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ప్రారంభం
Read Latest AP News And Telugu News