Skill Development Centre: ఏపీ అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏఐ ఆధారిత ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ప్రారంభం
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:19 PM
శ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ గ్రామీణ నైపుణ్య కేంద్రానికి వేదికగా నిలిచింది. గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తూ, యువత, మహిళలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సైయెంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్’ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ గ్రామీణ నైపుణ్య కేంద్రానికి వేదికగా నిలిచింది. గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తూ, యువత, మహిళలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సైయెంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్’ను (AI Based Rural Skill Development Centre) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ఇవాళ(ఆదివారం) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధి, డిజిటల్ పరివర్తన, ఉపాధి సృష్టి దిశగా ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
జీవనోపాధి కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది: నిర్మలా సీతారామన్
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. సైయెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఒక మోడల్ ఏఐ ఆధారిత గ్రామీణ నైపుణ్య, జీవనోపాధి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలు, రైతులు, స్వయం సహాయక బృందాలు, స్థానిక ప్రజలకు భవిష్యత్తుకు సిద్ధమైన నైపుణ్యాలను అందించడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా సాధికారత చేయడమే ఈ కేంద్రం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.

వికసిత్ భారత్ - 2047కు అనుసంధానంగా..
ఈ చొరవ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, వికసిత్ భారత్ - 2047 వంటి జాతీయ కార్యక్రమాలకు అనుసంధానంగా పనిచేస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాలు కూడా దేశ ఏఐ ఆధారిత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు అవ్వాలనే దృక్పథంతో ఈ హబ్‌ను రూపొందించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) భాగస్వామ్యాల ద్వారా ఎలా సమర్థవంతంగా వినియోగించవచ్చో ఈ కేంద్రం ఒక ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.

అత్యాధునిక సదుపాయాలతో...
ఈ సైయెంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందులో ఏఐ ఆధారిత శిక్షణా వ్యవస్థలు, స్మార్ట్ తరగతి గదులు, 40 కంప్యూటర్లతో కూడిన ఆధునిక ల్యాబ్, డ్రోన్ శిక్షణ పరికరాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, లైసెన్స్ పొందిన, ఓపెన్ సోర్స్ ఏఐ సాధనాలు ఉన్నాయని వివరించారు. అలాగే శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, శిక్షణార్థుల పురోగతిని రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు కేంద్రీకృత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారని వెల్లడించారు నిర్మలా సీతారామన్.

మూడు విభాగాల్లో శిక్షణ..
ఈ కేంద్రం ద్వారా అందించే శిక్షణా కార్యక్రమాలు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా, పరిశ్రమ అవసరాలకు సరిపోయేలా రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రధాన భవిష్యత్తు నైపుణ్య మార్గాలపై శిక్షణ అందించనున్నారని వెల్లడించారు. వీటిలో ఏఐ ఎనేబుల్డ్ డిజిటల్, ఐటీ లిటరసీ, ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్, ఈ - కామర్స్, అగ్రిటెక్, ఆక్వాటెక్ (డ్రోన్ ఆపరేషన్స్) ఉంటాయని వివరించారు. ప్రతి ట్రాక్‌కు 12 వారాల శిక్షణా కాలపరిమితి ఉంటుందని.. ఇందులో 60 శాతం ఆచరణాత్మక శిక్షణ, 40 శాతం ఏఐ సహాయక బోధన ఉంటుందని చెప్పుకొచ్చారు. శిక్షణ పూర్తయిన తర్వాత శిక్షణార్థులకు సర్టిఫికేషన్ అందించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌మెంట్, స్వయం ఉపాధి మార్గాలపై మార్గనిర్దేశం చేస్తారని చెప్పుకొచ్చారు. దీనివల్ల గ్రామీణ యువత నగరాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఏర్పడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

భాగస్వాములు కావాలి: బీవీఆర్ మోహన్ రెడ్డి
అనంతరం సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడారు. భారతదేశ డిజిటల్, ఏఐ ఆధారిత వృద్ధిలో గ్రామీణ సమాజాలు అర్థవంతంగా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో సైయెంట్ ఫౌండేషన్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సైయెంట్ ఫౌండేషన్ 120కి పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేసి, 35,000 మందికి పైగా విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యతను అందించిందని వివరించారు. పెదమైనవానిలంకలో ప్రారంభమైన ఈ కేంద్రం ఆ ప్రయత్నాలకు మరో కీలక అడుగుగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా మహిళల సాధికారత, యువత ఉపాధి, వ్యవసాయం సాంకేతికత అనుసంధానం, గ్రామీణ ఆర్థిక వృద్ధి వంటి అనేక లక్ష్యాలు ఒకేసారి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు. డ్రోన్ టెక్నాలజీ, అగ్రి టెక్, ఆక్వాటెక్ శిక్షణల ద్వారా రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన పెరుగుతుందని, వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడుతుందని సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ జలవనుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పలువురు శాసనసభ్యులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా నాయకులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి
Read Latest AP News And Telugu News