Share News

CM Chandrababu: రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:04 PM

ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

CM Chandrababu: రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తాం: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

అమరావతి: ఐటీలో హైదరాబాద్‌ (Hyderabad) అగ్రస్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు. దేశంలో మోస్ట్‌ లివబుల్‌ సిటీ హైదరాబాద్‌ అని వెల్లడించారు. అమరావతిలో ఏఐ, క్వాంటమ్‌ వ్యాలీకి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. సాంకేతికతతో పాటు సంఘవిద్రోహ శక్తులపై దృష్టి సారించామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


ఇవాళ(శుక్రవారం) గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. జిందాల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండింగ్ అయ్యారు. సీఎంకు గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ ఏఐ హ్యాకథాన్ నిర్వహించారు. హ్యాకథాన్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే కృత్రిమ మేధ హ్యాకథాన్‌ ప్రారంభించారు. అయితే.. పోలీస్ ఏఐ హ్యాకథాన్ మూడు రోజుల పాటు జరగనుంది. పోలీస్ శాఖలో కృత్తిమ మేథ వినియోగంపై పలు ప్రదర్శనలు జరిగాయి. అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. టెక్నాలజీ లేనప్పుడే తానేంటో చూపించానని ఉద్ఘాటించారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది.. ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలో చేసి చూపిస్తానని హెచ్చరించారు. పల్నాడులో ఏం జరిగిందో మీరు చూశారని తెలిపారు. తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు. గంజాయి పండిస్తాం తమను అడగొద్దని అంటే తాటతీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెనాలిలో రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌ని మాజీ సీఎం జగన్ పరామర్శించారని దుయ్యబట్టారు. గంజాయి బ్యాచ్‌ కోసం శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. జగన్ తన బాబాయిని చంపి నా మీద నెపం మోపి నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు.


వివేకాది గుండెపోటు అని ప్రచారం చేసి పోస్టుమార్టం తర్వాత డ్రామా ఆడారని సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలీసులు అప్పుడు ఏమాయిపోయారని ప్రశ్నించారు. ఘోరాతి ఘోరంగా చంపినవాళ్లు రాజకీయాలకు అర్హులా అని నిలదీశారు. ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో పోలీసులే చొరవ తీసుకోవాలని సూచించారు. సీబీఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్‌కు చోటు ఉండదని స్పష్టం చేశారు. నేర నియంత్రణ అదుపులో ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


గ్రీవెన్స్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు

రేపటి(శనివారం) నుంచి రెండు రోజులపాటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో భారీగా ఏర్పాట్లు చేపట్టారు. రేపు(శనివారం) పార్టీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎల్లుండి(ఆదివారం) ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జూన్ 2వ తేదీ నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు కూటమి నేతలు వివరించనున్నారు. ఈ కార్యచరణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్

సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 07:18 PM