CM Chandrababu: మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:56 AM
ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాక్ అసెంబ్లీ (Mock Assembly) అద్భుతమని.. విద్యార్థులు అదరగొట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఇవాళ(బుధవారం) మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల రూల్స్‌ను విద్యార్థులు ప్రదర్శించారు. మాక్ అసెంబ్లీలో సమకాలీన రాజకీయ అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. సభ్యుల మధ్య వాదోపవాదాలతో రక్తికట్టింది మాక్ అసెంబ్లీ. విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాక్ అసెంబ్లీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని.. అయితే ఏ పనిచేసినా పద్దతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పిలిచారని.. యూనివర్సిటీ లెక్చరర్‌గా చేరాలని తనను అడిగారని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యేను అయిన సందర్భంలో కాస్త తడబాటుకు గురయ్యానని గుర్తుచేశారు. అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియానే అని చెప్పుకొచ్చారు. విజన్ ఉంటే సరిపోదు.. దాన్ని అమలు చేయడం ముఖ్యమని తెలిపారు. నిరంతరం శ్రమ చేస్తేనే అనుకున్నది సాధించగలమని పేర్కొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలమని వివరించారు. చాలామంది హక్కులపైనే మాట్లాడతారని.. బాధ్యతలపై మాట్లాడరని అన్నారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest AP News And Telugu News