Share News

Cyber Crime: సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 10:57 AM

అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్‌వర్క్‌ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.

Cyber Crime: సిమ్ కార్డులతో భారీ సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు
Cyber Crime

అమరావతి , డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న భారీ సైబర్ క్రైమ్ (Cyber Crime) నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు ఛేదించారు. కంబోడియాను కేంద్రంగా చేసుకుని భారత్‌లోని పలు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను గుర్తించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 1400 సిమ్ కార్డులను సీఐడీ అధికారులు సీజ్ చేశారు.


కంబోడియా నుంచి సైబర్ మోసాలు

సీఐడీ అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. ఈ సైబర్ క్రైమ్ ముఠా కంబోడియా దేశం నుంచి ఆపరేట్ చేస్తూ.. భారత్‌లోని విశాఖపట్నం, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాల్లోని ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ముఖ్యంగా సిమ్ బాక్స్‌లను ఉపయోగించి ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.


ఆపరేషన్ జరిగింది ఇలా..

ఈ భారీ నెట్‌వర్క్‌ను చేధించడంలో డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DOT) కీలక పాత్ర పోషించింది. టెలికాం శాఖ నుంచి వచ్చిన సాంకేతిక సమాచారం, అనుమానాస్పద కాల్ ట్రాఫిక్ ఆధారంగా ఏపీ సీఐడీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. దీంతో సిమ్ బాక్స్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాల గుట్టు బయటపడింది.


వియత్నాం యువకుడు అరెస్ట్

ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వియత్నాం దేశానికి చెందిన హో హుడే అనే యువకుడిని బెంగాల్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనే భారత్‌లో సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు సంబంధించిన సిమ్ బాక్స్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నుంచి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు, సాంకేతిక పరికరాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ ముఠాతో అతడికి ఉన్న సంబంధాలపై కీలక సమాచారం బయటపడిన్నట్లు తెలుస్తోంది.


1400 సిమ్ కార్డుల స్వాధీనం

ఈ ఆపరేషన్‌లో భాగంగా సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న 1400 సిమ్ కార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్‌లను సిమ్ బాక్స్‌ల్లో అమర్చి విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి బాధితులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంక్ అధికారులు, పోలీసుల పేరుతో ప్రజలను భయపెట్టి నిందితులు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సైబర్ మోసం అని పోలీసులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ

క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 11:18 AM